
మన కలెక్టరేట్ భద్రమేనా..?
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లా అధికారుల సమీకృత భవనం(కలెక్టరేట్)లోని కొన్ని గదుల్లో పీఓపీ ఊడి పడడం, భవనానికి అక్కడక్కడ పర్రెలు రావడం చూస్తుంటే మన కలెక్టరేట్ భవనం భద్రమేనా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ భవనం నిర్మించి మూడేళ్లు కూడా పూర్తి కాలేదు.. అప్పుడే చిన్నపాటి వానలకు కురవడంతో ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలన్ని ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు గత ప్రభుత్వం ప్రతి జిల్లాకు జిల్లా అధికారుల సమీకృత భవనాలను నిర్మించింది. మహబూబ్‌నగర్ జిల్లా పాత కలెక్టరేట్ ఉండగా కొత్త కలెక్టరేట్‌ను జిల్లా కేంద్రంలోని పాలకొండ శివారులో నిర్మించారు. ఈ కొత్త కలెక్టరేట్ భవనం 2017 డిసెంబర్‌లో శంకుస్థాపన చేసి 2022 డిసెంబర్ 4వ తేదీన అప్పటి సీఎం కేసీఆర్ ప్రారంభించారు. 2023 అగస్టులో కురిసిన వానలకు భవనం ముందు భాగంలో వాన నీరు దిగువకు కారగా.. ఇంత నాసీరకంగా పనులు చేయడం ఏంటని, ఆర్‌అండ్‌బీ అధికారులు సరిగ్గా పర్యవేక్షించలేదనే విమర్శలు వినిపించాయి. దీంతో హుటాహుటీన అధికారులు స్పందించి కలెక్టరేట్ భవనం ముందు, వెనుక భాగంలో మరమ్మతులు చేపట్టారు.
మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌లోని ఈఈ చాంబర్‌లో ఊడిపడిన పీఓపీ
18 ఎకరాలు.. రూ.55.5 కోట్లతో నిర్మాణం
18 ఎకరాల్లో రూ.55.5 కోట్ల వ్యయంతోకలెక్టరేట్‌ను నిర్మించారు. ఇందులో మొత్తం 34 శాఖలు ఒకే చోట పాలన అందిస్తున్నాయి. మొదటి అంతస్తులో 13 శాఖలతో పాటు మంత్రికి (స్టేట్ చాంబర్ పేరుతో) ప్రత్యేక చాంబర్ కేటాయించారు. రెండవ అంతస్తులో 15 శాఖతో పాటు 31 మంది కూర్చునేలా మీటింగ్ హాల్ ఏర్పాటు చేశారు. పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం కొత్త జిల్లాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఒక్క భవనంలో ఏర్పాటు చేయాలని భావించింది. అందులో భాగంగా ప్రతి జిల్లా కేంద్రంలో కొత్త కలెక్టరేట్ భవనాలను నిర్మించింది. ఇన్ని రూ.కోట్లు వెచ్చించి నిర్మించిన భవనం అప్పుడే మరమ్మతులకు గురవడం, పీఓపీ ఊడిపడడం, విద్యుత్ లేని సమయంలో లిఫ్ట్ పనిచేయకపోవడంపై అటు ప్రజలు, ఇటు ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్‌అండ్‌బీ ఈఈ చాంబర్‌లో ఊడిపడిన పీఓపీ
ఉద్యోగులకు తప్పిన ప్రమాదం
చిన్నపాటి వానకు అక్కడక్కడ కురుస్తున్న వైనం

మన కలెక్టరేట్ భద్రమేనా..?