
జూరాలకు 3.65 లక్షల క్యూసెక్కుల వరద
ధరూరు: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు గురువారం వరద ఉధృతి మరింత పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. బుధవారం 2.92 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. గురువారం రాత్రి 8 గంటల సమయంలో 3.65 లక్షల క్యూసెక్కులకు పెరిగినట్లు వివరించారు. దీంతో ప్రాజెక్టు 41 క్రస్ట్‌గేట్లు పైకెత్తి 3,80,365 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఆవిరి రూపంలో 40 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 550, కుడి కాల్వకు 320 క్యూసెక్కులు వినియోగిస్తున్నట్లు వివరించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 5.885 టీఎంసీలు ఉన్నట్లు తెలిపారు.
పెరిగిన వరద.. నిలిచిన విద్యుదుత్పత్తి...
ఆత్మకూర్: జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వస్తుండటంతో దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి నిలిపివేసినట్లు ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు. అత్యధికంగా వరద వస్తుండటంతో ఉత్పత్తి సాధ్యం కాదని ఇప్పటి వరకు 533.580 మి.యూ ఉత్పత్తి విజయవంతంగా చేపట్టామన్నారు.
కోయిల్‌సాగర్ రెండు గేట్ల ఎత్తి..
దేవరకద్ర: కోయిల్‌సాగర్ జలాశయం రెండు గేట్లను ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. బుధవారం భారీగా వరద రావడంతో 5 గేట్లను ఎత్తగా.. గురువారం ఉదయం తగ్గడంతో రెండు గేట్ల ద్వారా, సాయంత్రం ఇన్‌ఫ్లో మరింత తగ్గడంతో ఒక గేటు నుంచి నీటి విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 32.6 అడుగులు కాగా.. ప్రస్తుతం 32 అడుగులు ఉంది.
41 క్రస్ట్‌గేట్లు ఎత్తి దిగువకు
నీటి విడుదల