
అనారోగ్యంతో కేజీబీవీ విద్యార్థి మృతి
● ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే!
● బాధిత కుటుంబ సభ్యుల నిరసన
● విచారణ చేస్తామన్న ఎస్‌ఐ నరేష్, డీటీ లక్ష్మీకాంత్
ఖిల్లాఘనపురం: మండల కేంద్రంలోని తెలుగు మీడియం కస్తూర్బాగాంధీ పాఠశాలకు చెందిన ఓ విద్యార్థి అనారోగ్యంతో ఈ నెల 17న మృతి చెందింది. పాఠశాల ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె మృతి చెందిందని విద్యార్థి తల్లిదండ్రులతో పాటుగా కుటుంబ సభ్యులు గురువారం పాఠశాల ఆవరణలో ఆందోళనకు దిగారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖిల్లాఘనపురం మండలంలోని కోతులకుంటతండాకు చెందిన కెతావత్ శ్రీను, కవిత బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లారు. వారి కుమార్తె జ్యోతి మండల కేంద్రంలోని తెలుగు మీడియం కస్తూర్బాగాంధీ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. జ్యోతితో పాటుగా పాఠశాలలోని 11 మంది ఈ నెల 8న అనారోగ్యం పాలవడంతో పాఠశాల అటెండర్ అనురాధ వారిని మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. జ్యోతికి జ్వరం ఎక్కువగా ఉందని వైద్యసిబ్బంది గ్లూకోజ్ పెట్టడంతో పాటుగా మొత్తం 11 మందికి మందులు ఇచ్చారు. విషయాన్ని జ్యోతి కుటుంబ సభ్యులకు చెప్పడంతో విద్యార్ధినికి అన్న వరసయ్యే జగదీష్ వచ్చి విద్యార్థిని ఇంటికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో విద్యార్థినికి తెల్ల పసరికలు వచ్చాయని తేలడంతో మొదట బిజినేపల్లికి, మహబూబ్‌నగర్ ఎస్‌వీఎస్ ఆస్పత్రి, హైదరాబాద్‌లోని ఆకృతి ఆస్పత్రి, యశోద ఆస్పత్రిలో చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో ఈ నెల 17న గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది. ఈ క్రమంలో తమ కుమార్తె అనారోగ్యం పాలైన సరైన సమయంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే చనిపోయింది శుక్రవారం బాధిత కుటుంబ సభ్యులు పాఠశాల ఆవరణలో ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ నరేష్, డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మీకాంత్ పాఠశాల వద్దకు చేరుకుని వారితో మాట్లాడారు. పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని, ఉపాధ్యాయుల నిర్లక్ష్యం ఉంటే చర్యలు ఉంటాయని చెప్పడంతో విద్యార్థి బట్టలు, పుస్తకాలు తదితర వస్తువులు తీసుకుని కుటుంబ సభ్యులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
రిజిస్టర్‌లో నమోదు చేయలే..
ఎస్‌ఐ నరేష్, డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మీకాంత్ విద్యార్థి పాఠశాల నుంచి ఎప్పుడు వెళ్లిందని రిజిస్టర్‌లో పరిశీలించగా.. ఎవరు తీసుకెళ్లారు, ఏ రోజు వెళ్లిందనే ఎలాంటి వివరాలు నమోదు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. దీంతో ప్రిన్సిపాల్ ప్రశాంతి, ఉపాధ్యాయుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ప్రతి విద్యార్థి పాఠశాల నుంచి ఎప్పుడు, ఎవరితో బయటకు వెళ్లిందని, తిరిగి తీసుకొచ్చిన వివరాలు పూర్తిస్థాయిలో నమోదు చేయాలని ప్రిన్సిపాల్‌కు సూచించారు.