
మళ్లీ చిరుత కలకలం
గండేడ్: ఐదు రోజుల క్రితం స్థానికంగా కలకలం రేపిన చిరుత తాజాగా మళ్లీ ప్రత్యక్షమైంది. శుక్రవారం చిరుత రోడ్డు దాటుతూ వాహనదారుడికి కనిపించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న అటవీ అఽధికారులు మరో మారు చిరుత జాడ కోసం గాలింపు చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని లింగాయిపల్లికి చెందిన ఆటో డ్రైవర్ గత్ప నరేష్ మంగళవారం సాయంత్రం బైక్‌పై రంగారెడ్డిపల్లి నుంచి స్వగ్రామానికి వస్తుండగా చింతగుట్టకు వెళ్లే దారి వద్ద చిరుత అకస్మాత్తుగా రోడ్డు దాటేందుకు దూకింది. అదే సమయంలో బైక్‌పై అక్కడికి చేరుకున్న నరేష్ ఎడమ చేతికి చిరుత కాలు తగలడంతో గాయం అయ్యింది. అప్పట్లో విషయం తెలుసుకున్న ఫారెస్టు డిప్యూటీ రేంజర్ రాఘవేంద్ర చిరుత రోడ్డు దాటిన ప్రదేశాన్ని సందర్శించి, పరిసరాలను పరిశీలించాడు. అయినా చిరుత ఆచూకీ దొరకలేదు.
ఇది మూడోసారి..
లింగాయిపల్లి ప్రాంతంలో గతంలో కూడా చిరుత సంచరించిందన్న వార్తల నేపథ్యంలో సమీప గ్రామాలైన రంగారెడ్డిపల్లి, సల్కర్‌పేట్, వెన్నాచేడ్, లింగాయిపల్లి వాసులు భయం గుప్పిట్లో ఉన్నారు. ప్రస్తుతం కూడా ఇదే ప్రాంతంలో తిరిగి మూడోసారి కనిపించడంతో గొర్రెల, మేకల, పశువుల కాపరులతో పాటు పొలాలకు వెళ్లేవారు జంకుతున్నారు.
ఐదో రోజు తిరిగి ప్రత్యక్షం
ఐదు రోజుల తర్వాత చిరుత మళ్లీ కంటపడడం కలకలం రేపింది. మండలంలోని రంగారెడ్డిపల్లికి చెందిన రాజేందర్ శుక్రవారం ఉదయం 7:30 గంటలకు దాదాపూర్ వెళ్లడానికి బయలుదేరాడు. ఈ క్రమంలో అతడు లింగాయిపల్లి గేటు దాటి కొద్ది దూరం వెళ్లగా చిరుత రోడ్డు దాటుతూ బూకలి నర్సింలు మామిడితోటలోకి వెళ్లడాన్ని గమనించి, తిరిగి స్వగ్రామానికి వచ్చాడు. చిరుత రోడ్డు దాటిన ప్రదేశానికి కొద్ది దూరంలో గొర్రెల మంద ఆపారు. మందకు కాపలాగా ఉన్న వెన్నాచేడ్ రాజు కుమార్తె భయంతో చెట్టు ఎక్కి కూర్చుంది. తర్వాత తండ్రి వచ్చాక కిందికి దిగి ఇంటికి వెళ్లిపోయింది.
లింగాయిపల్లి గేటు వద్ద రోడ్డు దాటిన వైనం
భయంతో వెనుదిరిగిన వాహనదారుడు
పరిసరాలను పరిశీలించిన అటవీ అఽధికారి

మళ్లీ చిరుత కలకలం