
జూరాలకు 3.55లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
● ప్రాజెక్టు 34 క్రస్టు గేట్ల ఎత్తివేత
● దిగువకు 3.50లక్షల క్యూసెక్కులు
ధరూరు: మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు శుక్రవారం రాత్రి 7.30 గంటల వరకు 3.55లక్షల క్యూసెక్కుల వరద వస్తున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 34 క్రస్టు గేట్లను ఎత్తి 3.49 లక్షల క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 37 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 550 క్యూసెక్కులు, కుడి కాల్వకు 430 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.431 టీఎంసీల నీరు నిల్వ ఉంది. రెండో రోజు జెన్కో జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తిని నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.
ఆల్మట్టి, నారాయణపూర్‌కు పెరిగిన ఇన్‌ఫ్లో
ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లో పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ఆల్మట్టి ప్రాజెక్టుకు పూర్తి స్థాయి నీటి మట్టం 129.72 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 97.277 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు 2.11లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. దిగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టుకు 2.50 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 37.64 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 25.658 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు 2.61లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. దిగువన ఉన్న జూరాలకు 30 గేట్లను ఎత్తి ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తున్నారు.
జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టు పరుగుల పెడుతున్న వరద