
హర్రర్, కామెడీ జానర్‌లోనే ‘అవంతిక–2’
జడ్చర్ల టౌన్: ఒక్కో దర్శకుడికి ఒక్కో జానర్ అంటే ఇష్టమని, తనకు హర్రర్, కామెడీ జానర్ అంటే ఇష్టమని నటుడు, దర్శకుడు శ్రీరాజ్ భళ్ల పేర్కొన్నారు. శుక్రవారం జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలోని బాదేపల్లి పెద్దగుట్టపై రంగనాయక స్వామి ఆలయంలో అవంతిక–2 సినిమా షూటింగ్ ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నరసింహాపురం రివేంజ్, అవంతిక హారర్ కామెడీ జానర్‌లో తీశామన్నారు. అవంతిక–2 సినిమాను కూడా హారర్ కామెడీ జానర్‌లోనే తీస్తున్నామన్నారు. రాంగోపాల్‌వర్మతో అన్నమయ్య సినిమా ఊహించలేమని, అలాగే రాఘవేంద్రరావుతో హారర్ సినిమా ఆశించలేమన్నారు. బలగం లాంటి సినిమా వేణుతోనే సాధ్యమైందని, అలాంటి జానర్‌లు తాను తీయలేనన్నారు. అందుకే హారర్ కామెడీ సినిమాలు తీస్తున్నామన్నారు. బాదేపల్లికి చెందిన ఫణిరాజ్‌తో పదేళ్ల ప్రయాణం కొనసాగుతుందని, అవంతికలో క్షుద్రపూజలు, మూఢనమ్మకాల గురించి తీశామని, అవంతిక కథ ఇప్పుడే బయటపెట్టమన్నారు. ఈ సినిమాకు ఫణిరాజ్ క్రియేటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారని, గీతాంజలి హీరోయిన్‌గా, రామకృష్ణశాస్త్రి నిర్మాతగా వ్యవహరిస్తున్నారని వెల్లడించారు.
ప్రాంత నటులకు ప్రాధాన్యత
జడ్చర్ల, మహబూబ్‌నగర్ జిల్లాలో అనేకమంది ప్రతిభగల నటులున్నారని, వారిలో కొందరికై నా అవకాశం కల్పించాలన్న పట్టుదలతో ఫణిరాజ్ ఉన్నారని, అందుకు త్వరలోనే అడీషన్స్ నిర్వహిస్తామన్నారు. హీరోయిన్ గీతాంజలి మాట్లాడుతూ.. అవంతిక 2 సినిమా సక్సెస్ కావాలని కోరుకుంది. గత సినిమాల షూటింగ్ ఇక్కడ జరగగా తనకు ఎంతో అనుబంధం ఏర్పడిందన్నారు. అవంతిక–2తోపాటు మరో 3సినిమాల్లో నటిస్తున్నట్లు వివరించారు.
ఔత్సాహికులకు సహకారం
ప్రతిభ ఉన్న నటులు, ఔత్సాహికులకు అవకాశం కల్పిస్తామని అవంతిక 2 టీం ప్రకటించడంపై మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అభినందనలు తెలిపారు. సినిమా గొప్ప విజయం సాధించి జడ్చర్లకు పేరు తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తనవంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని వెల్లడించారు.
రంగనాయకస్వామి ఆలయంలో పూజలు
అవంతిక 2 సినిమా స్క్రిప్ట్‌ను లక్ష్మీసమేత రంగనాయకస్వామి ఆలయంలో ఉంచి పూజలు చేశారు. అనంతరం హీరో, హీరోయిన్‌పై మాజీ మంత్రి లక్ష్మారెడ్డి క్లాప్‌కొట్టి సినిమాను ప్రారంభించారు. కార్యక్రమంలో సినిమా క్రియేటివ్ డైరెక్టర్ ఫణిరాజ్‌గౌడ్, ఆలయ పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు కాల్వరాంరెడ్డి, వార్డుకౌన్సిలర్‌లు రఘురాంగౌడ్, ప్రశాంత్‌రెడ్డి, దేవా, ఉమాశంకర్, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
సినీ నటుడు,
దర్శకుడు శ్రీరాజ్‌భళ్ల
పెద్దగుట్టపై సినిమా షూటింగ్ ప్రారంభం
క్లాప్‌కొట్టి కొట్టి ప్రారంభించిన మాజీ మంత్రి లక్ష్మారెడ్డి