
నేరాలే ప్రవృత్తిగా.. దొంగతనాలే పనిగా..
వనపర్తి: నేరాలను ప్రవృత్తిగా మార్చుకుని దొంగతనాలు చేస్తున్న ఓ వ్యక్తిని వనపర్తి పోలీసులు పట్టుకున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నేరస్తుడి వివరాలు మీడియాకు వెల్లడించారు. ఉదయం జిల్లా కేంద్రంలోని మర్రికుంట సమీపంలో రూరల్ ఎస్‌ఐ, సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా, ఓ వ్యక్తి బైక్‌కు సంబంధించిన పత్రాలు లేకపోవడంతో స్టేషన్‌కు తరలించారు. తమదైన శైలీలో విచారించగా దొంగతనాలు చేస్తున్నట్టు ఒప్పుడుకున్నాడు. పాన్‌గల్ మండలం బుసిరెడ్డిపల్లికి చెందిన మీనుగ రమేష్ కొంత కాలంగా దొంగతనాలు చేయడం ప్రవృత్తిగా మార్చుకుని జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో చోరీలు చేస్తున్నట్టు ఒప్పుకున్నాడు. అతని బైక్‌లో దొంగతనానికి వాడే వస్తువులతో పాటు అతని నుంచి రూ.11.43 లక్షల నగదు, 30గ్రాముల బంగారం, బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ తెలిపారు. నేరస్తుడిని పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించిన వనపర్తి సీఐ కృష్ణయ్య, వనపర్తి రూరల్ ఎస్‌ఐలు జలంధర్ రెడ్డి, వేణుగోపాల్, పోలీసు కానిస్టేబుళ్లు రఫి, ఆంజనేయులు, నవీన్‌గౌడ్‌లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి నగదు రివార్డు అందజేశారు.