
91.12 శాతం ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ
పాలమూరు: జిల్లా ఆరోగ్య శాఖ ఇమ్యూనైజేషన్ విభాగం ఆధ్వర్యంలో సోమవారం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్ల పరిధిలో 1–19 ఏళ్లలోపు బాల, బాలికలకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ చేపట్టారు. పిల్లల్లో నులి పురుగుల నిర్మూలన కోసం ఈ మాత్రలను అందజేశారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 2,54,210 మంది బాల, బాలికలను గుర్తించగా మొదటిరోజు 2,31,646 మంది (91.12 శాతం)కి మాత్రలు పంపిణీ చేశారు. మిగిలిన 22,564 మందికి ఈ నెల 18 వరకు మాప్‌ఆప్ కింద ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నారు.
మంచి ఆరోగ్యం అవసరం
విద్యార్థులకు చదువుతోపాటు మంచి ఆరోగ్యం అవసరమని, ఆరోగ్యంగా ఉన్న విద్యార్థులకు చదువు చక్కగా అర్థమవుతుందని కలెక్టర్ విజయేందిర అన్నారు. జిల్లా కేంద్రంలోని గాంధీ రోడ్ హైస్కూల్‌లో ఆమె విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసి మాట్లాడారు. విద్యార్థులు భవిష్యత్, జీవిత లక్ష్యం కోసం అడుగులు వేయాలని, ఉన్నత చదువులలో రాణించాలని సూచించారు. అనంతరం శివశక్తినగర్‌లోని అంగన్‌వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్‌వాడీ సెంటర్ ఆవరణలో ఉన్న చెత్తాచెదారం వెంటనే తొలగించాలని ఆదేశించారు. పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు ఇచ్చారా లేదా అడిగి తెలుసుకున్నారు. గుడ్లను సక్రమంగా ఉండికించి ఇవ్వాలని సూచించారు. అనంతరం తెలుగుగేరిలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ కృష్ణ, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి పద్మజా, వైద్యులు రఫీక్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
● జిల్లాలోని గంగాపూర్, అమిస్తాపూర్, హన్వాడ పీహెచ్‌సీలను డీఎంహెచ్‌ఓ తనిఖీ చేయడంతోపాటు విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు.