
పాటల సీడిని ఆవిష్కరిస్తున్న కార్యదర్శివర్గ సభ్యుడు బాల్ నర్సింహ
మహబూబ్‌నగర్ న్యూటౌన్: ప్రైవేటు విద్యా వ్యవస్థను రద్దు చేసి శాస్త్రీయ విద్యా విధానాన్ని అమలు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాల్‌నర్సింహ అన్నారు. స్థానిక సురవరం వెంకటరామిరెడ్డి భవన్‌లో ఆదివారం ఏఐఎస్‌ఎఫ్ 90వ వ్యవస్థాపక దినోత్సవాలను పురస్కరించుకొని ఉద్యమ యాదిలో గాయని రచయిత శ్యామల రూపొందించిన వీడియో ఆల్బమ్ సీడీ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉందని, విద్య వ్యాపార ధోరణితో పేదలకు అందని ద్రాక్షగా మారిందన్నారు. మోదీ ప్రభుత్వంలో కార్పొరేట్ శక్తులు విద్యను లాభాపేక్షగా మార్చి యాజమాన్యాలకు అనుకూలంగా విద్యారంగంలో సంస్కరణలు తెస్తూ కాషాయీకరణను పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు.
శాస్త్రీయ విద్యా విధానం ద్వారానే అంధ, మూఢ విశ్వాసాలు తొలగుతాయన్నారు. గాయని శ్యామల రచించి పాడిన పాట విద్యార్థుల్లో చైతన్యాన్ని నింపుతుందని అభినందించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బాలకిషన్, ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజు, జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సురేష్, శేఖర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.