అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
వనపర్తి/కొత్తకోట రూరల్: బంగారు షాపుల్లో నగలు కొనుగోలు చేసేందుకు వచ్చినట్టు గుంపుగా వచ్చి షాపులోని వారిని మాటల్లో పెట్టి బంగారు చోరీకి పాల్పడుతున్న దొంగల ముఠాను కొత్తకోట పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 3న కొత్తకోట పట్టణంలోని శివ హనుమాన్ జూవెలర్స్‌లో మధ్యాహ్నం షాపు యజమాని లేని సమయంలో ముగ్గురు ఆడవాళ్లు ముగ్గురు చిన్నారులతో కలిసి బంగారు కొనుగోలు చేసేందుకు వచ్చారు. షాపులో పనిచేసే వాళ్లను మాటల్లో పెట్టి రూ.6లక్షల విలువ చేసే బంగారు బిస్కెట్‌ను దొంగిలించారు. షాపులోని సీసీ కెమెరాల్లో దొంగతనం జరిగినట్టు తెలుసుకుని షాపు యజమాని విశ్వమోహన్ అదేరోజు కొత్తకోట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో కొత్తకోట ఎస్‌ఐ ఆనంద్, సీఐ రాంబాబు ఆధ్వర్యంలో రెండు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు. గురువారం పట్టణంలో అనుమానంగా తిరుగుతున్న మహిళలను పట్టుకుని తమదైన శైలీలో విచారించగా, చేసిన దొంగతనం ఒప్పుకున్నారు. నేరస్తుల వివరాలను జిల్లా కేంద్రంలో డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు మీడియాకు వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన నందకిషోర్ పవార్, రోహిత్ మచ్చీంద్ర, ఆకాష్ అంకూష్ పదుల్కర్ అలియాస్ అజయ్, సోనాలి, నిర్మలబాయితో పాటు ఇద్దరు బాలికలు ముఠాగా ఏర్పడి ఈనెల కొత్తకోటకు వచ్చి ఓ లాడ్జిలో రూంను తీసుకున్నారు. 3న ఉదయం పట్టణంలోని బంగారు షాపులను రెక్కి నిర్వహించారు. షాపులో యజమాని లేకపోవడం, పనిచేసే అబ్బాయి ఉన్నాడని చూసుకుని శివహనుమాన్ జూవెలర్స్ షాపులో బంగారు కొనేందుకు వెళ్లారు. షాపులో పనిచేసే అబ్బాయికి అడ్డంగా మహిళలు నిలబడి మాటల్లో పెట్టగా షాపులోని కౌంటర్‌లో గల రూ.6లక్షల విలువ చేసే బంగారు బిస్కెట్‌ను ముఠాలోని బాలిక దొంగతనం చేసింది. పథకం ప్రకారం పని పూర్తయిందని గమనించిన ముఠా సభ్యులు బయటకు వచ్చి అక్కడి నుంచి ఆటోలో కొద్ది దూరం వెళ్లారు. ముఠాలోని మగవారు వారికోసం కారును పెట్టుకొని ఎదురు చూస్తుండగా ఆటోలో వచ్చిన ఆడవాళ్లు కారులో ఎక్కి కర్నూల్ వైపు వెళ్లిపోయారు. కేసు నమోదు చేసి త్వరగా ఛేదించినందుకు ఎస్‌ఐ ఆనంద్‌ను, పట్టుకునేందుకు బృందాలుగా ఏర్పాటు చేసిన సీఐ రాంబాబును, సీసీఎస్ ఎస్‌ఐ రామరాజు, కానిస్టేబుల్స్ యుగంధర్‌గౌడ్, సత్యనారాయణయాదవ్, మురళి, మహిళా కానిస్టేబుళ్లు ప్రవళికతో పాటు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. ప్రతి షాపుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని షాపు యజమానులకు డీఎస్పీ సూచించారు.
రూ.6 లక్షల బంగారు,
కారు స్వాధీనం


