సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ
మహబూబ్‌నగర్ క్రైం: నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా సైబర్ నేరాలపై చాలా అప్రమత్తంగా ఉండాలని వాట్సప్‌లలో న్యూ ఇయర్ శుభాకాంక్షలు పేరుతో వచ్చే ఏపీకే ఫైల్స్ ఓపెన్ చేయవద్దని ఎస్పీ డి.జానకి ఒక ప్రకటనలో సూచించారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్‌లలో ఏపీకే పైల్స్ జతచేసి పంపే అవకాశం ఉందని, అప్రమత్తంగా లేకపోతే సైబర్ నేరాలకు గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇలాంటి లింక్‌లు ఓపెన్ చేయడం వల్ల మోబైల్‌లో ఉండే వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లే ప్రమాదం ఉందని తెలిపారు. సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930 లేదా స్థానిక పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేయాలని సూచించారు.
● జిల్లాలో ఉన్న ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ప్రతి ఒక్కరూ నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ డి.జానకి ఒక ప్రకటనలో తెలిపారు. నిబంధనలకనుగుణంగా కుటుంబసభ్యుల మధ్యలో వేడుకలు చేసుకోవాలన్నారు.
అవసరం మేరకే యూరియా వినియోగించండి
జడ్చర్ల: రైతులు పంటలకు అవసరం మేరకే యూరియాను వినియోగించాలని వ్యవసాయ శాఖ నోడల్ అధికారి బాలునాయక్ పేర్కొన్నా రు. బుధవారం డీఏఓ వెంకటేశ్‌తో కలిసి జడ్చర్లలో ఆగ్రో సేవా కేంద్రాన్ని వారు తనిఖీ చేశారు. యూరియా కొనుగోలు, కొత్తగా తీసుకొచ్చిన యాప్ ద్వారా యూరియా బుకింగ్, రైతులకు యాప్ ద్వారా బుకింగ్‌పై ఎంతమేరకు అవగాహన కలిగి ఉన్నారని విచారించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 17,610 మంది రైతులు 52,545 బస్తాల యూరియాను యాప్ ద్వారా బుక్ చేసుకొని కొనుగోలు చేశారని తెలిపారు. ఇంకా 26,220 బస్తాల యూరియా నిల్వ యాప్ ద్వారా కొనుగోలుకు సిద్ధంగా ఉందన్నారు.


