నయా జోష్‌లో ప్రత్యేక ఆంక్షలు
వేడుకలకు అనుమతి లేదు
● జిల్లాకేంద్రంపై ప్రత్యేక దృషిసారించిన
పోలీసులు
● తొమ్మిది బ్రీత్ అనలైజర్స్‌తో
నాలుగు బృందాల తనిఖీలు
● బైపాస్, చించోళి రహదారిపై పెట్రోలింగ్
మహబూబ్‌నగర్ క్రైం: న్యూఇయర్ వేడుకలకు ఓవైపు యువత సన్నద్ధమవుతుంటే.. మరోవైపు ఈ కొత్త ఏడాది వేడుకలను ఎలాంటి అనుమతి లేదని.. ఎవరి ఇళ్లలో వారు చేసుకోవాలని పోలీస్ శాఖ అధికారులు చెబుతున్నారు. సాధారణంగా 31రాత్రి వేడుకలు అంటే ముఖ్యంగా మద్యం ఏరులై పారేలా కనిపిస్తోంది. డిసెంబర్ 31, జనవరి 1న అత్యధికంగా అమ్మకాలు సాగించేందుకు మద్యం దుకాణాలు, బార్‌లు సిద్ధమవుతున్నాయి. ఈ జోష్‌లో చాలామంది ఉదయం నుంచి పార్టీల్లో మునిగి తేలుతుంటారు. ప్రధానంగా యువత, విద్యార్థులు ఎంతో ప్రత్యేకంగా చేసుకోవాలని ఉత్సాహపడుతుంటారు. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ పెద్దసంఖ్యలో రోడ్లపైకి వచ్చి కేరింతలు కొడుతూ వాహనాలను వేగంగా నడుపుతూ ప్రమాదాలకు గురవుతుంటారు. మద్యం తాగి వాహనాలను నడుపుతూ ప్రమాదాలు కొనితెచ్చుకుంటుంటారు.
● పాలమూరు జిల్లావాసులతోపాటు నగర యూత్ డిసెంబర్ 31తోపాటు న్యూఇయర్ వేడుకలు అర్ధరాత్రి వరకు జరుపుకోవడం జరిగింది.. బుధవారం సాయంత్రం నుంచే సంబురాలు మొదలు పెట్టడంతోపాటు ఎక్కడిక్కడ బృందాలుగా ఏర్పడి దావత్‌లు చేసుకున్నారు. మహబూబ్‌నగర్ నగరంతోపాటు జడ్చర్లలో ఆయా అపార్టుమెంట్‌లలో.. ఉమ్మడి కుటుంబాల్లో భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పట్టణంలో దుకాణాలన్నీ అమ్మకాలతో సందడిగా మారాయి. ముఖ్యంగా బేకరీలకు గిరాకీ బాగా పెరిగింది. వేడుకలు జరపుకొనే వారికోసం వేలాది కేకులను నిర్వహకులు తయారు చేయడం కోసం ఏర్పాట్లు చేసి విక్రయాలు నిర్వహించారు.
● యువత, విద్యార్థులు నూతన సంవత్సరం వేడుకలను జరుపుకోవాలని సాయంత్రం నుంచే మందు, విందు, వాహనం తదితర అంశాలకు సంబంధించిన నగదు, ఇతరత్రా సామగ్రిపై చర్చించుకున్న దృశ్యాలు కన్పించాయి. తమకు అనువైన చోట్ల పార్టీలు చేసుకోవడానికి స్థలాల ఎంపికలో ఎవరికివారు బీజీబీజీగా గడిపారు. మద్యం తాగి రాత్రి 12గంటలు దాటిన వెంటనే ద్విచక్ర వాహనాలపై రోడ్లపై రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు అమలు చేశారు. నగరంలోని బైపాస్ రోడ్‌లోని పిస్తాహౌజ్ నుంచి పాలకొండ చౌరస్తా వరకు అదేవిధంగాా చించోళి రోడ్డు మార్గంలో కోయిలకొండ ఎక్స్‌రోడ్ నుంచి వీరన్నపేట వరకు వరకు ప్రత్యేకంగా పెట్రోలింగ్ ఏర్పాటు చేశారు.
● గట్టి బందోబస్తు
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలో డీఎస్పీ ఆధ్వర్యంలో ఆరు నుంచి 8మంది సీఐలతోపాటు ఎస్‌ఐలు, కానిస్టేబుల్స్ భారీ స్థాయిలో బందోబస్తులో పాల్గొన్నారు. జిల్లా కేంద్రానికి ఇతర ప్రాంతాల నుంచి కూడా పోలీస్ సిబ్బందిని రప్పించారు. జిల్లా కేంద్రంలో 9 బ్రీత్‌అనలైజర్లతో వాహనదారులను తనిఖీలు నిర్వహించారు. మద్యం మ త్తులో వాహనాలు నడిపి ప్రమాదాలు చేస్తున్న నేపథ్యంలో పోలీసు అధికారులు బార్ల యాజమానులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. మద్యం మత్తు లో వాహనాలు నడిపేవారు ప్రమాదాలు చేయకుండా బుధవారం రాత్రి8గంటల నుంచి తెల్లవారుజామున 4గంటల వరకు ట్రాఫిక్ పోలీసులు, సివిల్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పట్టణంలో ప్రత్యేక డ్రంకెన్‌డ్రైవ్ నిర్వహించారు. డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన ప్రతి వాహనదారుడిని, వాహనాల ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మద్యం మ త్తులో వాహనాలు నడిపినవారిపై పోలీసులు న్యా య స్థానాలు కఠినంగా వ్యవహరించనున్నాయి.
ఇయర్ వేడుకలకు ఎలాంటి అనుమతి లేదు. ఎవరికి వారు ఇళ్లలో నిర్వహించుకోవాలి. ఎక్కువమంది రోడ్లపైకి రాకూడదు. ఈ 31వేడుకల్లో ప్రధానంగా డ్రంకన్‌డ్రైవ్, త్రీబుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్‌పై ప్రధానంగా దృష్టిపెట్టాం. 31న రోజు రాత్రి 11గంటల నుంచి రోడ్లపై తనిఖీలు చేశాం. పిస్తాహౌజ్, అంబేద్కర్ చౌరస్తా, వన్‌టౌన్ చౌరస్తా, భగిరథ కాలనీకమాన్ వద్ద ప్రత్యేకంగా నాలుగు బృందాలు ఏర్పాటు చేసి డ్రంకన్‌డ్రైవ్ తనిఖీలు చేశాం. ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒక బృందం పనిచేసింది. మద్యం తాగి ప్రజలకు ఇబ్బంది కల్గించే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నాం.
– వెంకటేశ్వర్లు, మహబూబ్‌నగర్ డీఎస్పీ


