రెండోరోజు కొనసాగిన ధర్నా
● గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మించొద్దని రైతుల నిరసన
గోపాల్‌పేట: ఏదుల రిజర్వాయర్ పక్కనే ఉందని, గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణ పనులు చేపట్టి స్థానికంగా ఉండే రైతుల భూములను కొల్లగొట్టొద్దని ప్రారంభించిన ధర్నా బుధవారం రెండోరోజుకు చేరింది. ఏదుల రిజర్వాయర్‌కే తూము ఉందని దీనిద్వారా నీటిని వదిలితే కోడేరు మండలంలోని పలు గ్రామాలకు సైతం నీరు వెళుతుందని ఈ సందర్భంగా గ్రామస్తులు పేర్కొన్నారు. ఏదుల రిజర్వాయర్‌కు ఏర్పాటు చేసిన తూము వద్దకు రెండు గ్రామాల రైతులు, అఖిలపక్ష నాయకులు చేరుకుని విలేకర్లతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా ఏదుల రిజర్వాయర్ నిర్మించారని, అప్పుడు గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణం కోసం ప్రపోజల్ పెట్టగా అప్పటి మంత్రి నిరంజన్‌రెడ్డిని భూములు కోల్పోతామని చెప్పగా గొల్లపల్లి రిజర్వాయర్‌ను విరమించుకున్నారని వివరించారు. ఇప్పుడేమో గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మిస్తామని చెప్పడం రైతులను ముంచడమే అవుతుందని అన్నారు. ఇప్పటికై నా స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి స్పందించి గొల్లపల్లి రిజర్వాయర్ పనులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు ధర్నాను ఉధ్రుతం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు అర్జున్‌రావు, జానయ్య, శ్రీవర్దన్‌రెడ్డి, రాములు, చెన్నారం మాజీ సర్పంచు రమేష్, ఇందిర, రాములు, అబ్దుల్ మహమూద్, రెండు గ్రామాల రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


