కృష్ణానదిలో యువకుడి గల్లంతు
కొల్లాపూర్ రూరల్: ప్రమాదవశాత్తు మండలంలోని సోమశిల సమీపంలో ఉన్న కృష్ణానదిలో పడి యువకుడు గల్లంతైన ఘటన గురువారం చోటు చేసుకుంది. తోటి మిత్రులు చెప్పిన వివరాలు.. వనపర్తి జిల్లా పెద్దగూడెం గ్రామానికి చెందిన ఐదుగురు యువకులతో కలిసి బింగిని అశోక్ డిసెంబర్ 31 రాత్రి వేడుకలు చేసుకోవడానికి సోమశిల చేరుకున్నారు. ఈ సందర్భంగా తోటి మిత్రులు చెప్పినా వినకుండా కృష్ణానది పరివాహక ప్రాంతంలో వైజాక్ జాలర్లకు చెందిన పుట్టి వేసుకొని అశోక్ అర్ధరాత్రి నదిలో వెళ్లాడు. అతడు ఎంతకూ రాకపోవడంతో ఆందోళన చెందిన మిత్రులు గ్రామస్తులు, మత్స్యకారులతో కలిసి నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. కానీ పుట్టిలో అశోక్‌కు సంబంధించిన చెప్పులే ఉన్నాయని మత్స్యకారులు గుర్తించారు. సమాచారం అందుకున్న కొల్లాపూర్ ఇన్‌చార్జి ఎస్‌ఐ సతీష్ సోమశిలకు చేరుకొని గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ.. గల్లంతైన అశోక్ కర్నూలు జిల్లాకు చెందినవాడని తెలిపారు. కొన్నేళ్లుగా హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో సెక్యూరిటీ సెంటర్‌లో పని చేస్తున్నాడని పేర్కొన్నారు. అతడికి భార్య, కుమార్తె ఉన్నట్లు తోటి మిత్రులు తెలిపారు.


