గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి

Jan 2 2026 11:42 AM | Updated on Jan 2 2026 11:42 AM

గుర్త

గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి

మిడ్జిల్‌: విధులు ముగించుకొని ఇంటికి వస్తున్న యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన గురువారం తెల్లవారుజామున మిడ్జిల్‌ మండలంలోని లింభ్యాతండా సమీపంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ శివనాగేశ్వర్‌నాయుడు, గ్రామస్తుల కథనం మేరకు.. మండలంలోని వస్పుల గ్రామానికి చెందిన గొరిగె మదన్‌ (24) పోలేపల్లి సెజ్‌లోని హెటిరో కంపెనీలో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో డిసెంబర్‌ 31, బుధవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి విధులకు హాజరయ్యాడు. డ్యూటీ ముగించుకొని గురువారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో తన మోటార్‌ సైకిల్‌పై ఇంటికి వస్తుండగా.. జడ్చర్ల–కల్వకుర్తి ప్రధాన రహదారిపై లింభ్యాతండా సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మదన్‌ ఘటనా స్థలంలో మృతి చెందాడు. మృతదేహానికి పోర్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి భార్య మనీష, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య గొరిగె మనీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

నీటిసంపులో

పడి చిన్నారి మృతి

అమ్రాబాద్‌: నీటిసంపులో పడి చిన్నారి మృతి చెందిన ఘటన గురువారం సాయంత్రం అమ్రాబాద్‌ మండలం జంగంరెడ్డిపల్లిలో చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. గ్రామానికి చెందిన మండారి రాణి, సైదయ్య దంపతుల కుమార్తె జనశ్రీ(రెండున్నరేళ్లు) తన తల్లి ఇంట్లో పని చేస్తుండగా ఇద్దరు అన్నలతో కలిసి ఆడుకుంటుంది. ఈ క్రమంలో నీటిసంపు మూత తీసి ఉండటంతో ప్రమాదవశాత్తు అందులో పడింది. తల్లి గమనించి బయటకు తీయగా నీళ్ల మింగి పరిస్థితి విషమంగా మారింది. 108 అంబులెన్స్‌లో అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. చిన్నారి మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

వ్యక్తి అనుమానాస్పద మృతి

అయిజ: మండలంలోని చిన్న తాండ్రపాడు గ్రామానికి చెందిన బోయ ఆంజనేయులు (50) గురువారం మండలంలోని మేడికొండ గ్రామ సమీపంలో రోడ్డుపై అనుమానాస్పదంగా మృతి చెందాడు. ఆంజనేయులకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఈయనకు గతేడాది గుండెపోటు వచ్చిందని, ఇప్పుడు కూడా గుండెపోటుతో మృతి చెంది ఉంటాడని స్థానిక ప్రజలు అనుమానం వ్యక్తం చేశారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసరావు పేర్కొన్నారు.

రైలు కిందపడి యువతి ఆత్మహత్య

గద్వాల క్రైం: గుర్తు తెలియని యువతి రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడిన ఘటన సెంకడ్‌ రైల్వేగేట్‌ సమీపంలో గురువారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. కాచిగూడ నుంచి గుంటూరుకు వెళ్తున్న రైలు గద్వాల రైల్వే స్టేషన్‌కు చేరుకునే సమయంలో స్టేషన్‌ సమీపంలో గుర్తు తెలియని యువతి (26) రైలు పట్టాలపై కూర్చొని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రమాదంలో సదరు యువతి అక్కడికక్కడే పడి మృతి చెందింది. గమనించిన లోకో పైలెట్‌ రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనపై రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ అశోక్‌ కేసు నమోదు చేసి మృతురాలి వివరాలపై ఆరా తీస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి ఆచూకీ తెలిసిన వారు రైల్వే పోలీసులను సంప్రదించాల్సిందిగా ఆయన తెలిపారు.

రేడియం స్టిక్కర్‌

షాపు దగ్ధం

అచ్చంపేట రూరల్‌: ప్రమాదవశాత్తు రేడియం స్టిక్కర్‌ షాపు దగ్ధమైన ఘటన గురువారం మధ్యాహ్నం పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. పట్టణంలోని రాజీవ్‌– ఎన్టీఆర్‌ మినీ స్టేడియం సమీపంలో రాంబాబు అనే వ్యక్తికి చెందిన రేడియం స్టిక్కర్‌ షాపు డబ్బా నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో డబ్బాను సగం తెరిచి బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు డబ్బాకు నిప్పంటుకొని వస్తువులు దగ్ధమయ్యాయి. గమనించిన స్థానికులు ఫైర్‌ సిబ్బందికి సమాచారం ఇవ్వగా ఫైర్‌ అధికారి శంకర్‌, సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు. సుమారు రూ.2 లక్షల నష్టం సంభవించినట్లు బాధితుడు రాంబాబు తెలిపారు.

గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి 
1
1/3

గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి

గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి 
2
2/3

గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి

గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి 
3
3/3

గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement