‘పాలమూరు’ను పట్టించుకోని కేసీఆర్
దేవరకద్ర రూరల్: బీఆర్‌ఎస్ పార్టీ ఉత్తర తెలంగాణ మీద ఉన్న ప్రేమతో కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు భారీగా నిధులు మళ్లించడంతో పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు ముందుకు సాగలేదని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి ఆరోపించారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భూత్పూర్‌లో సభ నిర్వహించనున్నట్లు వార్తలు వచ్చాయన్నారు. 2015, జూన్‌న్11న నాడు ముఖ్యమంత్రి హోదాలో ఇదే ప్రాంతంలో కర్వెన ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేసి మూడేళ్లలో నిర్మాణం పూర్తిచేసి భూములు కోల్పోయిన వారికి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారన్నారు. నేటికీ పదేళ్లు గడిచినా పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేశారని, అవసరాల కోసం ప్రాజెక్ట్ అంచనా వ్యయం పెంచి ప్రజలను మభ్య పెట్టారని ఆరోపించారు. కర్వెన ప్రాజెక్ట్ ప్రధాన కాల్వల కోసం అంగుళం భూమి కూడా సేకరించకుండా ఎన్నికల సమయంలో హంగు ఆర్భాటాలతో నార్లాపూర్ దగ్గర మోటార్ ప్రారంభించారని ఎద్దేవా చేశారు. 2017లో కోయిల్‌సాగర్ నుంచి అదనంగా 50 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందిస్తానని ప్రగల్భాలు పలికిన హరీశ్‌రావు కనీసం 50 ఎకరాలకు కూడా అందించలేదని విమర్శించారు. మామ అల్లుళ్లు కలిసి పాలమూరుకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చాక పాలమూరు ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఐదు సార్లు సమీక్ష నిర్వహించారని.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్ట్ వద్ద మట్టి, కాంక్రీట్ పనులు చేపట్టినట్లు వివరించారు. నిపుణులతో చర్చించి గతంలో ఉన్న లోపాలను సరిచేసి పనులు చేపడతామని తెలిపారు. పాలమూరు ప్రాజెక్టు నిర్మాణాన్ని గాలికి వదిలేసి ఉమ్మడి జిల్లా ప్రజలను మోసం చేసిన కేసీఆర్ ముందుగా క్షమాపణ చెప్పిన తర్వాతే భూత్పూర్‌కు రావాలన్నారు.
దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి
అధికారులతో సమీక్ష..
అంతకుముందు పుర పరిధిలోని సమస్యలపై సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. రూ.15 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనుల వివరాలు అడిగి తెలుసుకొని వేగవంతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో పట్టణ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


