కుటుంబ పోషణ భారమై యువకుడి అత్మహత్య

- - Sakshi

రాజాపూర్‌: మండల కేంద్రంలో శుక్రవారం ఉరేసుకొని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపారు. ఆయన కథనం మేరకు.. మహబూబ్‌నగర్‌లోని రాంనగర్‌కు చెందిన శివ (24) రాజాపూర్‌లో ట్రాక్టర్‌ మెకానిక్‌ దుకాణం ఏర్పాటు చేసుకొని తల్లి, చెల్లితో కలిసి ఉంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. కుటుంబ పోషణ భారంగా మారడంతో మనోవేదనకు గురై ఇంట్లో ఎవరూలేని సమయంతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అక్క ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.

అప్పుల బాధతో  వ్యక్తి బలవన్మరణం
ఉండవెల్లి: అప్పుల బాధతో మండల కేంద్రానికి చెందిన వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. శుక్రవారం హెడ్‌కానిస్టేబుల్‌ ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన గోపాల్‌ (45) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు. ఈయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. కాగా ఇంటి నిర్మాణం, ఒకే ఏడాదిలో కుమారుడు, కుమార్తె వివాహం చేశాడు. దీంతో అప్పులు అధికమవడంతో ఆర్థికభారంతో మండల కేంద్రం శివారులోని పంట పొలంలో ఉరేసుకున్నాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ఆర్థిక ఇబ్బందులతో మరో యువకుడు..
మహమ్మదాబాద్‌:
ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ పోషణ భారంగా మారి ఓ యువకుడు నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. మండల కేంద్రానికి చెందిన గూళ్ల అంజి (28) చెరువుల్లో చేపలు పట్టడానికి కూలీ పనికి వెళ్లేవాడు. తాగుడుకు బానిసై ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ పోషణ భారంగా మారి గురువారం సాయంత్రం ఒంటిపై పెట్రోలు పోసుకొని నిప్పంటించుకుని మృతిచెందాడు. అంజికి భార్య మేఘన, రెండేళ్ల కుమార్తె ఉన్నారు.

బస్సు ఢీకొని వ్యక్తి..
భూత్పూర్‌:
మండలంలోని ఎల్కిచర్ల సమీపం భట్టుపల్లితండా (ఏవీఆర్‌ కాలనీ) వద్ద శుక్రవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని 35 ఏళ్ల వ్యక్తి మృతిచెందినట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.

నాగర్‌కర్నూల్‌ నుంచి భూత్పూర్‌ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు రహదారి పక్కన నడుచుకుంటూ వెళ్తున్న గుర్తు తెలియని వ్యక్తిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడన్నారు. నల్లటిరంగు టీషర్డు, నల్లటి ప్యాంటు ధరించి ఉన్నాడని.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా జనరల్‌ ఆస్పత్రికి తరలించి బస్‌ డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వివరించారు.

ఎడ్లబండిని ఢీకొట్టిన బైక్‌.. నలుగురికి గాయాలు
పెబ్బేరు రూరల్‌: ఎడ్లబండిని బైక్‌ ఢీకొట్టిన ప్రమాదంలో నలుగురికి గాయాలైన ఘటన వనపర్తి జిల్లా శ్రీరంగాపురం సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. శ్రీరంగాపురం గ్రామానికి చెందిన గోవిందమ్మ, బాలీశ్వరమ్మ, బిచ్చన్న వ్యవసాయ పనులు ముగించుకొని ఎడ్లబండిపై ఇంటికి వస్తుండగా, అదే గ్రామానికి చెందిన రమేష్‌ ద్విచక్ర వాహనంపై వెనుక నుంచి వేగంగా వచ్చి ఎడ్లబండిని ఢీకొట్టాడు.

ప్రమాదంలో ఎడ్లబండిపై ఉన్న వారితో పాటు రమేష్‌కు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108లో వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ వెంకటస్వామి తెలిపారు.

ఇది చదవండి: short circuit: పొలంలో పని చేస్తుండగా వరికోత మిషన్‌ దగ్ధం

Read latest Mahabubnagar News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top