
కొల్లాపూర్: ఎన్నికల్లో ఎత్తులకు పై ఎత్తులు.. ఓటర్లను తికమక పెట్టే చర్యలు సహజంగా మారిపోయాయి. కొల్లాపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇవి మరోసారి వెలుగు చూస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం నామినేషన్లు వేసిన అభ్యర్థుల్లో ఒకే పేరు కలిగిన అభ్యర్థులు ముగ్గురు ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాల్లో కోరిన గుర్తులు కూడా దాదాపుగా ఒకే రకంగా ఉన్నాయి.
బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి నామినేషన్ వేయగా.. అలయెన్స్ డెమక్రటిక్ రిఫార్మ్ పార్టీ అభ్యర్థిగా నల్గొండ జిల్లా తిరగండ్లపల్లెకు చెందిన కీసరి హర్షవర్ధన్‌రెడ్డితో పాటు హైదరాబాద్ చైతన్యపురికి చెందిన ఎల్లేని హర్షవర్ధన్‌రావు స్వతంత్ర అభ్యర్థిగా కొల్లాపూర్‌లో నామినేషన్ వేశారు. ఈ మూడు పేర్లు ఒకేలా ఉండటం చర్చనీయాంశంగా మారింది.
స్వతంత్ర అభ్యర్థుల్లో ఎక్కువ మంది రోడ్ రోలర్, ఆటోరిక్షా, ఎయిర్ కండీషనర్, కంప్యూటర్, సిలిండర్, ట్రాక్టర్ గుర్తులను కోరుకున్నారు. ఇవన్నీ ఇంచుమించుగా కారు గుర్తుకు దగ్గరి పోలికలు ఉండేవే. ఓటర్లను కన్ఫ్యూజ్ చేసేందుకు స్వతంత్రులు బరిలో దిగినట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు.