విహారయాత్రకు వెళ్తున్న కళాశాల బస్సు బోల్తా
● విద్యార్థులకు తప్పిన పెను ప్రమాదం
● ప్రమాదస్థలాన్ని పరిశీలించిన
మంత్రి వాకిటి శ్రీహరి, కలెక్టర్, ఎస్పీ
రాజాపూర్: ఓ ప్రైవేటు కళాశాలకు చెందిన విద్యార్థులు బస్సులో విహారయాత్రకు వెళ్తుండగా బస్సు బోల్తా పడిన ఘటన గురువారం చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు బస్సులో ఉన్న విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీ ల్చుకున్నారు. పూర్తి వివరాలు.. నారాయణపేట జి ల్లా మరికల్ మండల కేంద్రంలోని మణికంఠ జూనియర్ కళాశాల విద్యార్థులు 43 మంది క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో కళాశాల బస్సులో హైదరాబాద్ లోని జలవిహార్ విహారయాత్రకు బయలు దేరారు. ఈ క్రమంలో బాలానగర్ మండలం కేతిరెడ్డిపలక్లి శివారులో జాతీయరహదారిపై ముందు వెళ్తున్న కారును ఢీకొట్టడంతో రోడ్డుపై బస్సు బోల్తా పడింది. విద్యార్థుల హాహాకారాలు విన్న స్థానికులు కిటికీల్లోంచి వారిని బయటకు తీశారు. ప్రమాదంలో గా యాలపాలైన 10 మంది విద్యార్థులను బాలానగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం షాద్‌నగర్ బుగ్గారెడ్డి ఆస్పత్రికి తరలించారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన
మంత్రి వాకిటి శ్రీహరి..
ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి వనపర్తికి వెళ్తున్న మంత్రి వాకిటి శ్రీహరి ప్రమాద స్థలం వద్ద పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన విద్యార్థులను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించి రోడ్డు మధ్యలో పడి ఉన్న బస్సును భారీ క్రేన్ సాయంతో పక్కకు తొలగించి అక్కడి నుంచి వనపర్తికి వెళ్లారు. అనంతరం కలెక్టర్ విజయేంద్రబోయి, ఎస్పీ జానకి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. జాతీయ రహదారిపై ఏర్పడిన ట్రాఫిక్ జామ్‌ను జడ్చర్ల రూరల్ సీఐ నాగార్జునగౌడ్, బాలానగర్, రాజాపూర్ ఎస్‌ఐలు లెనిన్, శివానందంగౌడ్ క్రమబద్ధీకరించారు.
విహారయాత్రకు వెళ్తున్న కళాశాల బస్సు బోల్తా


