ఆధారాలున్నా.. పక్కదారి | - | Sakshi
Sakshi News home page

ఆధారాలున్నా.. పక్కదారి

Dec 26 2025 10:06 AM | Updated on Dec 26 2025 10:06 AM

ఆధారాలున్నా.. పక్కదారి

ఆధారాలున్నా.. పక్కదారి

అసలేం జరిగింది.. అధికారులకు ఫిర్యాదులు.. నిందితుల రిమాండ్‌.. మరో ఇద్దరిని తప్పించినట్లు పుకార్లు..

ప్రియుడితో కలిసి భర్తను చంపిన కేసులో ట్విస్టు

ఇద్దరూ ఉపాధ్యాయులు కావడంతో కేసు తారుమారుకు ప్రయత్నాలు?

పోలీసుల తీరుపై బాధిత

కుటుంబ సభ్యుల అనుమానాలు

ఎట్టకేలకు నిందితుల అరెస్టు,

రిమాండ్‌కు తరలింపు

అచ్చంపేట రూరల్‌: అచ్చంపేట పట్టణంలో ఓ వ్యక్తి హత్య జరిగి నెలరోజులైంది. అందుకు సంబంధించిన అన్ని ఆధారాలను మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు అందించారు. అయినప్పటికీ అది హత్య కాదని కొట్టి పారేశారు పోలీసులు. చివరికి మృతుడి బంధవులు పోలీసు ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులను కలిసి హత్యోదంతంపై ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో హత్యకేసు తమకు చుట్టుకునేలా ఉందని గ్రహించిన స్థానిక పోలీసులు ఎట్టకేలకు నిందితులను అరెస్టు చేశారు. అయితే హత్య కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వివరించాల్సి ఉండగా.. బుధవారం రాత్రి 9.30 గంటలకు వాట్సప్‌ గ్రూప్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టినట్టుగా ఫొటో, అసంపూర్తి సమాచారాన్ని పోస్టుచేసి చేతులు దులుపుకొన్నారు.

అచ్చంపేటలోని మారుతీనగర్‌ కాలనీలో నివాసముంటున్న లక్ష్మణ్‌నాయక్‌(38) నవంబర్‌ 25న అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈయన సోదరుడు శ్రీరామ్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉంటే.. లక్ష్మణ్‌ భార్య పద్మ 2024 డీఎస్సీలో ఉపాధ్యాయురాలిగా ఎంపికై ఉప్పునుంతల మండలం తాడూరు ప్రభుత్వ పాఠశాలలో పనిచేసింది. అదే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు గోపితో ఆమెకు పరిచయం ఏర్పడి ఏడాదికాలంగా వివాహేతర సంబంధం కొనసాగింది. ఈ విషయం భర్తకు తెలియడంతో మందలించాడు. ఈ విషయాన్ని గోపికి చెప్పడంతో తమకు అడ్డుగా ఉన్న లక్ష్మణ్‌నాయక్‌ను హతమార్చేందుకు పథకం రచించారు. నవంబర్‌ 24న రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న లక్ష్మణ్‌నాయక్‌ను భార్య పద్మ, ఆమె ప్రియుడు గోపి కలిసి హత్య చేశారు. మరుసటి రోజు ఉదయం ఏమీ తెలియనట్టుగా పద్మ పాఠశాలకు వెళ్లింది. ఆ తర్వాత ఇంటి యజమానికి ఫోన్‌ చేసి.. తన భర్తకు ఫోన్‌ చేసినా స్పందించడం లేదని నటించింది. మధ్యాహ్నం హడావుడిగా ఇంటికొచ్చి.. లోపల తన భర్త చనిపోయి ఉన్నాడని బంధువులు, ఇంటి చుట్టుపక్కల వారిని నమ్మించింది.

తాడూరు పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేసిన పద్మ, గోపి ప్రవర్తనపై విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదులు అందాయి. అప్పట్లో పద్మను మందలించి ఉప్పునుంతల మండలం గట్టుకాడిపల్లి పాఠశాలకు పంపించారు. ఈ క్రమంలోనే ఉపాధ్యాయురాలు పద్మ తన భర్తను హత్యచేసిన ఘటన బయట పడటంతో గట్టుకాడిపల్లి గ్రామస్తులు ఆ ఉపాధ్యాయురాలు తమకొద్దంటూ విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

నెల రోజుల తర్వాత అచ్చంపేట పోలీసులు దర్యాప్తులో వాస్తవాలను రాబట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలను సీఐ నాగరాజు, ఎస్‌ఐ సద్దాంహుస్సేన్‌ వెల్లడించారు. లక్ష్మణ్‌నాయక్‌ను తన భార్య పద్మ, ప్రియుడు గోపి హత్యచేసినట్లు ఆధారాలను సేకరించి బుధవారం రాత్రి అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితులను అచ్చంపేట జూనియర్‌ సివిల్‌కోర్టు జడ్జి ఎదుట హాజరుపర్చగా.. రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.

లక్ష్మణ్‌నాయక్‌ హత్యకు సంబంధించిన అన్ని ఆధారాలను బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు అందించినా పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. స్థానిక పోలీసుల తీరుపై ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులకు ఫిర్యాదు చేయడంతో.. ఇక చేసేదేమీ లేక దర్యాప్తు ముమ్మరం చేశారని తెలుస్తోంది. కాగా, ఈ కేసులో మరో ఇద్దరిని తప్పించినట్లు బాహాటంగా చర్చ జరుగుతోంది. పోస్టుమార్టం రిపోర్టును కూడా తారుమారు చేయడానికి ప్రయత్నాలు జరిగాయని.. పెద్ద మొత్తంలో కొందరికి ముడుపులు ముట్టజెప్పడానికి నిందితులు వెనకాడలేదని తెలుస్తోంది. దీంతోనే హత్యకు సంబంధించిన వివరాలను కూడా మీడియా ముందు వెల్లడించడానికి పోలీసులు ఆసక్తి చూపలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement