సాక్షి, కృష్ణా జిల్లా: పోలీసుల ఆంక్షలతో మచిలీపట్నంలో శుక్రవారం ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వంగవీటి మోహన రంగా వర్ధంతి పేరిట రాజకీయ పార్టీలు ర్యాలీలు నిర్వహించాయి. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ ర్యాలీని మాత్రమే పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది.
మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) ఆధ్వర్యంలో వంగవీటి రంగా వర్ధంతి కోసం రామానాయుడుపేట నుంచి వైఎస్సార్‌సీపీ భారీ ర్యాలీకి ప్లాన్ చేసింది. అయితే.. ఈ ర్యాలీకి పోలీసులు ఆంక్షలు విధించారు. కూటమి నేతల ర్యాలీ ఉందని.. ఆ తర్వాతే మీ ర్యాలీ నిర్వహించుకోవాలని పార్టీ శ్రేణులకు తేల్చి చెప్పారు. అయితే తాము వేరే రూట్‌లో ర్యాలీ పెట్టుకున్నా ఎందుకు అడ్డుకుంటున్నారంటూ పోలీసులను పేర్ని నాని నిలదీశారు.
వైఎస్సార్సీపీ ఆఫీస్ ముందు నుంచి కూటమి ర్యాలీకి అనుమతి ఇచ్చామని.. ఇరవర్గాలు తారసపడితే ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందని పోలీసులు పేర్ని నానికి వివరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే వైఎస్సార్‌సీపీ ఆఫీస్ ముందు బారికేడ్లు, అదనపు బలగాలు ఏర్పాట్లు చేసినట్లు సీఐ ఏసుబాబు వివరించారు. ఈ వివరణతో పేర్ని నాని మండిపడ్డారు. పోలీసుల తీరు.. ‘పచ్చ’పాత ధోరణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. చివరకు పేర్ని నాని డిమాండ్‌తో దిగొచ్చిన పోలీసులు ర్యాలీకి అనుమతి ఇవ్వడంతో పరిస్థితి చక్కబడింది.


