వైద్యారోగ్య శాఖకు ఆందోళనల సెగ! | - | Sakshi
Sakshi News home page

వైద్యారోగ్య శాఖకు ఆందోళనల సెగ!

Nov 12 2026 1:31 AM | Updated on Nov 12 2026 1:31 AM

టీకాల పంపిణీ నుంచి స్క్రీనింగ్‌ వరకు..

డిసెంబర్‌ 15వ తేదీ నుంచి ‘ఆశ’ల సమ్మె

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల బాటలో ‘ఆశ’లు.. వైద్య సేవలకు ఆటంకం?

హన్మకొండ అర్బన్‌ : జిల్లాలో వైద్యారోగ్య శాఖ సేవలకు ఆందోళనల సెగ తగులుతోంది. ఇప్పటికే జాతీయ ఆరోగ్య మిషన్‌ పరిధిలోని ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం నిరవధిక ఆందోళన చేపట్టి నవంబర్‌ 11 నాటికి 30 రోజులు పూర్తయ్యాయి. మరోవైపు ఆశ కార్యకర్తలు కూడా డిసెంబర్‌ 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నట్లు ప్రకటించారు. హనుమకొండ జిల్లాలో 700 ఆశ కార్యకర్తల పోస్టులు ఉండగా, ప్రస్తుతం 690 మంది పనిచేస్తున్నారు. అలాగే, ఎన్‌హెచ్‌ఎం పరిధిలో వైద్యులు మొదలు.. క్షేత్రస్థాయి సిబ్బంది వరకు సుమారు 15 రకాల కేడర్లలో 410 మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ రెండు వర్గాలూ ఆందోళన బాట పట్టడంతో క్షేత్రస్థాయిలో వైద్య సేవల నిర్వహణపై ప్రభావం పడే అవకాశం ఉంది.

30 రోజులుగా ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల

ఆందోళన..

రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 17 వేల మంది ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు 78 కేడర్లలో పనిచేస్తున్నారు. వైద్యులు మొదలు.. క్షేత్రస్థాయి సిబ్బంది వరకు వివిధ కేడర్లకు చెందిన ఉద్యోగులు జాయింట్‌ యాక్షన్‌ కమిటీగా ఏర్పడి తమ సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్‌ 13 నుంచి నిరవధిక ఆందోళన కొనసాగిస్తున్నారు. ఉద్యోగాలను క్రమబద్ధీకరించడంతోపాటు ఉద్యోగ భద్రత కల్పించి వేతనాల పెంపు, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. హనుమకొండ కలెక్టరేట్‌ ఎదుట కూడా ఆందోళన చేపడుతున్నారు. నవంబర్‌ 11 నాటికి ఈ నిరసనలకు 30 రోజులు పూర్తయ్యాయి. అయినా ప్రభుత్వం నుంచి సమస్యల పరిష్కారానికి స్పష్టమైన చర్యలు కనిపించడం లేదని ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇంతకాలం ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల పనుల్లో అధిక భాగాన్ని ఆశ కార్యకర్తలతోనే చేయిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు వారూ సమ్మెకు సిద్ధమవుతుండడంతో వైద్యారోగ్య శాఖ యంత్రాంగానికి మరింత ఇబ్బందికర పరిస్థితి ఎదురుకానుంది.

సీఐటీయూ పరిధిలోని ‘ఆశ’లేనా..

అందరూ వస్తారా?

ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు వివిధ కేడర్లకు చెందిన వారంతా జేఏసీగా ఏర్పడి సమ్మెలో పాల్గొంటుండగా, ఆశ కార్యకర్తల సమ్మెకు సంబంధించి పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రస్తుతం సీఐటీయూ అనుబంధ ఆశ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో సమ్మె నోటీసులు ఇచ్చారు. దీంతో డిసెంబర్‌ 15 నుంచి సమ్మెలో కేవలం సీఐటీయూ అనుబంధంగా ఉన్న ఆశ కార్యకర్తలే పాల్గొంటారా? లేక జిల్లాలోని మొత్తం కార్యకర్తలు ఆందోళనలోకి వస్తారా? అనే అంశంపై వేచి చూడాల్సి ఉంది.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎలా?

జిల్లాలో ఇప్పటికే ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల విధులకు ప్రత్యామ్నాయంగా ఇతర సిబ్బందితో పనులు చేయించేందుకు అధికారులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆశ కార్యకర్తలు కూడా సమ్మెకు దిగితే క్షేత్రస్థాయి సేవలను కొనసాగించేందుకు ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తారన్నది ప్రశ్నగా మారింది. రెండు వర్గాల ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం స్పందించకపోతే వైద్య సేవల నిర్వహణ మరింత సవాలుగా మారే అవకాశం ఉంది.

ఆశ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో వైద్యారోగ్య శాఖకు కీలక సేవలు అందిస్తున్నారు. బుధ, శనివారాల్లో నిర్వహించే టీకాల పంపిణీ కార్యక్రమాలు, గర్భిణులు, బాలింతల పర్యవేక్షణ, చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో వీరి పాత్ర కీలకం. కేన్సర్‌ స్క్రీనింగ్‌, కుష్ఠు వ్యాధి నివారణతో పాటు పలు జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ ఆశ కార్యకర్తల సేవలు అవసరం. ఇప్పటికే ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల ఆందోళనతో సిబ్బంది కొరతను ఎదుర్కొంటున్న ఆ శాఖ.. ఆశ కార్యకర్తలు కూడా సమ్మెకు దిగితే ఈ కార్యక్రమాలను ఎలా కొనసాగిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది.

ఇప్పటికే 30 రోజులుగా ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల ఆందోళనలు

డిసెంబర్‌ 15 నుంచి ఆశ కార్యకర్తల నిరవధిక సమ్మె

క్షేత్రస్థాయిలో వైద్య సేవలపై

ప్రభావం పడే అవకాశం

తమకు నెలకు రూ.18 వేల స్థిర వేతనం చెల్లించడంతోపాటు ఈఎస్‌ఐ, పీఎఫ్‌ సౌకర్యాలు కల్పించి పని భారం తగ్గించాలని ఆశ కార్యకర్తలు డిమాండ్‌ చేస్తున్నారు. విధుల్లో చనిపోతే రూ.50 లక్షల బీమా, అంత్యక్రియల ఖర్చుల కింద రూ.50 వేలు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ మేరకు సీఐటీయూ, బీఆర్‌టీయూ ఆధ్వర్యంలో జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి, జిల్లా రెవెన్యూ అధికారికి సమ్మె నోటీసులు అందజేశారు. సమ్మె సన్నాహాల్లో భాగంగా ఈ నెల 16న జిల్లా కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమం చేపట్టనున్నట్లు సంఘాల నాయకులు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement