● ఎంజీఎం సూపరింటెండెంట్
డాక్టర్ రాంకుమార్‌రెడ్డి
కాశిబగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని పిల్లల వార్డులో వెంటిలేటర్ల కొరత లేదని సూపరింటెండెంట్ డాక్టర్ కాటం రాంకుమార్‌రెడ్డి తెలిపారు. గురువారం సూపరింటెండెంట్ కార్యాలయంలో తమను కలిసిన మీడియాతో మాట్లాడారు. పిల్లల వార్డులో అవసరమైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని, వెంటిలేటర్ల కొరత ఉన్నట్లు వస్తున్న ఆరోపణలో వాస్తవం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం 12 వెంటిలేటర్లు పనిచేస్తున్నాయని, పిల్లలందరికీ అత్యవసర సేవలు వైద్య సిబ్బంది అందిస్తున్నారని వివరించారు.
తగ్గుముఖం పట్టిన జ్వరాలు...
ప్రస్తుతం వైరల్ ఫీవర్ పేషెంట్లు ఎక్కువగా లేరని, అయినా వారి కోసం తగిన ఏర్పాట్లు చేశామని తెలిపారు. జ్వరాలు తగ్గుముఖం పట్టడంతో బెడ్స్ కొరత కూడా లేదన్నారు. గత పదిహేను రోజుల క్రితం పలు రకాల జ్వరాలకు సంబంధించిన పేషెంట్లకు నివారణ చికిత్సలు అందించామని పేర్కొన్నారు. ప్రస్తుతం 15 నుంచి 20 వరకు జ్వరాల బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. ఇందులో ఒకటిరెండు డెంగీ కేసులు ఉన్నాయని, వారికి తగిన చికిత్స చేస్తున్నట్లు పేర్కొన్నారు.


