ప్లాస్టిక్‌తో పరేషాన్‌! | - | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌తో పరేషాన్‌!

Nov 13 2026 3:59 AM | Updated on Nov 13 2026 3:59 AM

మహబూబాబాద్‌: విచ్చలవిడిగా ప్లాస్టిక్‌ వినియోగంతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతోంది. దీంతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కవర్లను వినియోగించి రోడ్లు, కాల్వల్లో వేయడం వల్ల పారిశుద్ధ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే ప్లాస్టిక్‌ విక్రయ షాపులు ఏర్పాటు చేశారు. 120 మైక్రాన్ల కంటే తక్కువ సైజ్‌ కవర్లను విక్రయించొద్దు. కానీ, సంబంధిత అధికారులు తనిఖీలు లేకపోవడంతో వాటి విక్రయాలు, వినియోగం పెరుగుతోంది.

మున్సిపాలిటీల్లోనే ఎక్కువగా వినియోగం..

జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి. హోల్‌సేల్‌ ప్లాస్టిక్‌ విక్రయ షాపులు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా మానుకోట మున్సిపాలిటీలో 36 వార్డులు ఉండగా 65,712 మంది ఓటర్లు ఉన్నారు. ఉద్యోగ, విద్యా, వ్యాపారం రీత్యా మానుకోటలో నివాసం ఉండే వారితో కలిపితేలక్ష జనాభా దాటుతుంది. మానుకోట మున్సిపాలిటీ పరిధిలో సుమా రు 15 ప్లాస్టిక్‌ విక్రయ షాపులు ఉన్నాయి. చిన్నచిన్నవి 30కి పైగా ఉన్నాయి. ఆ షాపులకు ఎలాంటి అనుమతులు లేకుండానే విక్రయిస్తున్నారు.

కూరగాయల వ్యాపారులు అధికంగా..

కూరగాయల వ్యాపారులు, పండ్లు, హోటళ్లు, కర్రీ పాయింట్‌, చికెన్‌, మటన్‌, కిరాణా షాపులు, బేకరీ తదితర షాపులు, చిరు వ్యాపారులు ఎక్కువగా ప్లాస్టిక్‌ కవర్లు వినియోగిస్తున్నారు. ప్రజలు కూడా కవర్లు ఉన్నాయనే ధీమాతో సంచులు తీసుకోకుండానే షాపులకు వెళ్తున్నారు. ఆ షాపుల యజమానులు కవర్లలో వేసి ఇస్తున్నారు. వాటిని ఇంటికి తీసుకెళ్లి తర్వాత కవర్లను రోడ్లపై, కాల్వల్లో, మున్సిపాలిటీ వాహనాల్లో వేస్తున్నారు.

పారిశుద్ద్య సమస్య..

ప్లాస్టిక్‌ కవర్లను కాల్వల్లో వేయడం వల్ల మురుగు నిలిచి దోమల సంఖ్య పెరుగుతోంది. అలాగే చెత్తాచెదారం పేరుకుపోయి కార్మికులకు సమస్యగా మారింది. 70శాతం మహిళలు కవర్లను చెత్తాచెదారంతో కలిపి మున్సిపాలిటీ వాహనాల్లో వేస్తున్నారు. మానుకోట మున్సిపాలిటీలో ప్రతీరోజు 33 టన్నుల చెత్త వెలువడుతండగా.. అందులో కవర్లు కనీసం 20శాతం ఉంటున్నాయి.

తనిఖీలు కరువు..

ప్లాస్టిక్‌ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు మున్సిపాలిటీ అఽధికారులు అవగాహన కల్పించాలి. కానీ, ఆరు నెలలుగా ఆ కార్యక్రమాలు లేవు. శానిటరీ ఇన్‌స్పెక్టర్‌, పర్యావరణ అధికారి, వార్డు ఆఫీసర్లు నిరంతరం షాపులను తనిఖీ చేయాలి. స్పెషల్‌ డ్రైవ్‌లు నిర్వహించి ప్లాస్టిక్‌ వినియోగం, విక్రయం అరికట్టాలి.

పర్యావరణానికి ముప్పు..

ప్లాస్టిక్‌ వినియోగం వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుంది. క్యాన్సర్‌ లాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నా.. సంబంధిత అధికారులు మాత్రం ఆ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 2022లో పొల్యూషన్‌ కంట్రోల్‌బోర్డు అన్ని మున్సిపాలిటీల్లో స్పెషల్‌ డ్రైవ్‌లు నిర్వహించి భారీ ఎత్తున ప్లాస్టిక్‌ కవర్లు స్వాధీనం చేసుకుంది.

మిగిలిన మున్సిపాలిటీల్లో..

మిగిలిన మరిపెడ, డోర్నకల్‌, తొర్రూరు, కేసముద్రం మున్సిపాలిటీల్లో కూడా తనిఖీలు అంతంత మాత్రంగానే చేస్తున్నారు. అక్కడ కూడా విచ్చలవిడిగా ప్లాస్టిక్‌ విక్రయాలు చేస్తున్నారు. ఇదే పరిస్థితి ఉంటే పర్యావరణం పూర్తిగా దెబ్బతింటుంది.

మున్సిపాలిటీల్లో విచ్చలవిడిగా వినియోగం

ఎలాంటి అనుమతులు లేకుండా విక్రయ షాపుల ఏర్పాటు

పర్యావరణానికి ముప్పుతో పాటు ఆరోగ్యంపై ప్రభావం

ప్లాస్టిక్‌ కవర్లతో తలెత్తుతున్న

పారిశుద్ధ్య సమస్య

అధికారుల తనిఖీలు నిల్‌

తనిఖీలు చేపడతాం..

ఈ ఏడాది తనిఖీలు పెద్దగా చేయలేదు. ప్లాస్టిక్‌తో పర్యావరణం దెబ్బతినడంతో పాటు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. త్వరలోనే కమిషనర్‌ ఆదేశాలతో తనిఖీలు చేస్తాం. వ్యాపారులు, ప్రజలు అర్థం చేసుకొని ప్లాస్టిక్‌ వాడొద్దు.

– గుజ్జు క్రాంతి, మానుకోట మున్సిపాలిటీ

పర్యావరణ అధికారి

విక్రయ షాపులపై చర్యలు తీసుకోవాలి

జిల్లా కేంద్రంలో ప్లాస్టిక్‌ విక్రయ షాపులు పెరుగుతున్నాయి. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. తనిఖీలు చేయకపోవడంతో వాటి విక్రయాలు, వినియోగం పెరుగుతోంది. రోడ్లు, కాల్వలు ఇలా ఎక్కడ చూసినా కవర్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

– శ్రీనివాస్‌, మానుకోట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement