మహబూబాబాద్: గ్రంథాలయాల అభివృద్ధికి మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల నుంచి రావాల్సిన పన్ను పెండింగ్‌లో ఉంటుంది. దీంతో లైబ్రరీల అభివృద్ధి కుంటుపడుతోంది. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఇద్దరు లైబ్రేరియన్లు మినహా అన్ని పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. మిగిలిన గ్రంథాలయాలకు స్వీపర్లే దిక్కయారు. దీనికి తోడు జిల్లా కేంద్రంలో తప్ప మిగిలిన చోట్ల కనీస సౌకర్యాలు లేక పాఠకులు ఇబ్బందులు పడుతున్నారు.
రెండు మినహా అన్ని పోస్టులు ఖాళీ..
జిల్లా కేంద్రంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఇద్దరు లైబ్రేరియన్లు మాత్రమే ఉన్నారు. ఇన్‌చార్జ్ కార్యదర్శి విధులు నిర్వర్తిస్తున్నారు. డిప్యూటీ లైబ్రేరియన్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, అటెండర్, వాచ్‌మెన్, తోటమాలి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇటీవల జీ ప్లేస్ టు భవనం అన్ని హంగులతో నిర్మాణం చేశారు. 29,000 రీడింగ్ పుస్తకాలు, 3,500 మంది సభ్యులు, ప్రతీ రోజు 400నుంచి 500 మంది పాఠకులు వస్తున్నారు. ఫర్నిచర్ సరిపోను ఉంది. వాటర్ ప్లాంట్, లిఫ్ట్ ఇతర సౌకర్యాలు ఉన్నాయి.
2గ్రామ గ్రంథాలయాలు,
11శాఖ గ్రంథాలయాలు..
జిల్లాలోని కేసముద్రం, నెల్లికుదురు, బయ్యారం, మరిపెడ, దంతాలపల్లి, తొర్రూరు, గూడూరు, కొత్తగూడ, ఇనుగుర్తి, డోర్నకల్, గార్లలో శాఖ గ్రంథాలయాలు ఉన్నాయి. కురవి మండల కేంద్రం, అదే మండలంలోని రాజోలులో గ్రామ గ్రంథాలయాలు ఉన్నాయి. పక్కా భవనాలు, కనీస సౌకర్యాలు లేక పాఠకులు ఇబ్బందులు పడుతున్నారు. ఆ గ్రంథాలయాల్లో అన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
సెస్ పెండింగ్..
గ్రంథాలయాల అభివృద్ధికి మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల ఆస్తి పన్నులో 8శాతం చెల్లించాలి. 8శాతం పన్న జిల్లా గ్రంథాలయ సంస్థ ఖాతాలో జమ కావాలి. అయితే సుమారు రూ.3కోట్ల సెస్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. దీంతో అభివృద్ధి కుంటుపడుతోంది.
చైర్మన్ ప్రత్యేక చొరవ..
ఈ ఏడాది మే 13న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా శ్రీకాంత్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. నాటి నుంచిగ్రంథాలయంలో సౌకర్యాలు కొంత మెరుగుపర్చారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. సొంత డబ్బులతో స్టడీ మెటీరియల్, ఇతర పుస్తకాలు కొనుగోలు చేసి అందజేశారు. సెస్ బకాయిల విషయంలో అధికారులతో మాట్లాడారు.
సెస్ పెండింగ్‌తో కుంటుపడుతున్న
గ్రంథాలయాల అభివృద్ధి
జిల్లా కేంద్రంలో తప్ప మిగిలిన చోట్ల సౌకర్యాలు నిల్
జిల్లాలో 14 గ్రంథాలయాలు..
పోస్టుల ఖాళీతో పాఠకుల అవస్థలు
నేటి నుంచి గ్రంథాలయ వారోత్సవాలు


