మరిపెడ రూరల్: మరో నాలుగు రోజుల్లో ఆ ఇంట్లో శుభకార్యం జరగాల్సి ఉండగా, విధి వక్రించింది. కుటుంబంలో ఆనందోత్సాహాలు నింపాల్సిన వేళ మృత్యువు కారు రూపంలో దూసుకొచ్చి దంపతులను బలిగొంది. శుభకార్యానికి అవసరమైన సామగ్రి కొనుగోలు చేసేందుకు బైక్‌పై మరిపెడకు బయలుదేరిన దంపతులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన బుధవారం మహబూ బాబాద్ జిల్లా మరిపెడ మండలం బాల్నిధర్మారం స్టేజీ సమీపం 365 జాతీయ రహదారిపై చోటు చే సుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మరిపెడ మండలం లచ్చతండా జీపీకి చెందిన బానోత్ సామా(45), పద్మ (4 3) దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఓ కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ నెల 16వ తేదీన చిన్నకుమారుడు సుధాకర్ నిశ్చితార్థం జరగాల్సి ఉంది. దీంతో శుభకార్యానికి కావాల్సిన సామగ్రి కొనుగోలు నిమిత్తం దంపతులు బైక్‌పై మరిపెడకు బయలుదేరారు. ఈ క్రమంలో సూర్యాపేట నుంచి మహబూబాబాద్ వైపునకు వెళ్తున్న కారు బాల్నిధర్మారం స్టేజీ సమీ పంలో ఎదురుగా ఆగి ఉన్న లారీ దాటే క్రమంలో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో సామా, పద్మ దంపతులు ఎగిరి రోడ్డు అవతల పడడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న ఎస్సై వెంకన్న ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదతీరును పరిశీలించి విచారణ చేపట్టారు. కాగా, తల్లిదండ్రులిద్దరు ఒకేసారి మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో చావు డప్పు వినిపించడంతో గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు.
రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం
నిశ్చితార్థ వేడుకకు సిద్ధమవుతున్న
ఇంట్లో తీరని లోటు


