కాశిబుగ్గ: వరంగల్ మట్టెవాడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బొమ్మలగుడి, కుమ్మరి వీధిలో సాయికుమార్ అనే వ్యక్తిపై శ్రీకాంత్ అనే వ్యక్తి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. సీఐ కరుణాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. కుమ్మరి వీధిలో నివసిస్తున్న ఓ మహిళ ఏడాదికాలంగా సాయికుమార్‌ను ప్రేమిస్తున్నానంటూ వెంటపడింది. ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త శ్రీకాంత్ భార్యతో గొడవ పడిన ప్రతిసారీ సాయికుమార్‌తోనూ గొడవ పడేవాడు. సాయికుమార్ పలుమార్లు తనకు సదరు మహిళతో ఎలాంటి సంబంధం లేదని చెప్పినా శ్రీకాంత్ పగ పెంచుకున్నాడు. ఇందులో భాగంగా ఆరునెలలుగా సాయికుమార్‌ను చంపడానికి యత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం సాయికుమార్ వీధిలో ఒంటరిగా వెళ్తుండగా పథకం ప్రకారం కత్తితో దాడి చేశాడు. గమనించిన సాయికుమార్ తల్లి హంసబాయి అడ్డుకోవడానికి యత్నించగా ఆమె దవడపై కొట్టి పక్కకు నెట్టేసి శ్రీకాంత్ పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న బ్లూకోల్ట్స్ అధికారి ఎం.నరేశ్ ఘటనా స్థలికి చేరుకుని గాయపడిన సాయికుమార్‌ను చికిత్స నిమిత్తం ఎంజీఎం తరలించారు. అనంతరం ఎస్సై శ్రీనివాస్ ఆస్పతికి వెళ్లి బాధితుడి తల్లి హంసబాయి నుంచి ఫిర్యాదు స్వీకరించి కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కరుణాకర్ తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.
బొమ్మలగుడి ప్రాంతంలో ఘటన


