నేడో రేపో పింఛన్లు అందించేందుకు కసరత్తు
● తుది జాబితా సిద్ధం చేస్తున్న అధికారులు
● దివ్యాంగుల సర్టిఫికెట్లు రాక జాప్యం
● వైద్యారోగ్యశాఖ వద్ద పైలేరియా జాబితా
● జిల్లాలో 16,486 దరఖాస్తులు
సాక్షి, మహబూబాబాద్: కొత్త ఆసరా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల ఆశ నెరవేరే రోజు దగ్గర పడుతోంది. దీపావళి కానుకగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొత్త పింఛన్లను లాంచనంగా ప్రారంభించిన నేపథ్యంలో అధికారులు జిల్లా జాబితాను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఉన్నతాధికారులు కూడా జిల్లా జాబితాను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో జిల్లాలో కొత్త పింఛన్ల ప్రక్రియ వేగవంతమైంది.
కొత్తగా 11వేల వరకు అప్రూవల్
కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో 11వేల మేరకు అప్రూవల్ చేసినట్లు తెలిసింది. అయితే దరఖాస్తుల పరిశీలనకు వెళ్లిన అధికారులు రకరకాల కొర్రీలు పెట్టి కొందరి పెన్షన్లను రిజెక్ట్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు మరోసారి ఉన్నతాధికారుల నేతృత్వంలో పరిశీలన చేయించారు. ఇందులో ఒంటరి మహిళ, వితంతు, దివ్యాంగుల్లో కొందరికి అప్రూవల్ చేశారు. ఇలా ఇప్పటి వరకు జిల్లాలో 11వేల పింఛన్లు అప్రూవల్ అయినట్లు సమాచారం. అదేవిధంగా వెయ్యి మంది మేరకు గీత కార్మికుల పెన్షన్లు పొందేందుకు అర్హత సాధించినా.. తుది జాబితా ప్రకటించాల్సి ఉంది.
దివ్యాంగుల్లో ఉత్కంఠ
పుట్టకతో కొందరు, ప్రమాదాలు, వ్యాధుల బారినపడి ఇంకొందరు ఇలా దివ్యాంగులుగా మారిన వారు కొత్త పింఛన్ ఎప్పుడు ఇస్తారోనని ఎదురుచూశారు. అయితే తీరా పింఛన్ దరఖాస్తులు చేసుకునే సమయానికి సదరన్ సర్టిఫికెట్ కాలపరిమితి ముగియడంతో రెన్యూవల్ కోసం మళ్లీ దరకాస్తు చేసుకోవాల్సి వచ్చింది. సదరన్ క్యాంపుల్లో ఆలస్యం కావడం, సర్టిఫికెట్ జారీ సందర్భంగా గతం కన్నా తక్కువ పర్సంటేజీతో సర్టిఫికెట్ జారీ చేయడంతో పింఛన్‌కు అర్హత కోల్పోవాల్సి వస్తుంది. ఇలా సదరన్ క్యాంపు పిలుపు రాక కొందరు, సర్టిఫికెట్ రాక మరికొందరు, సర్టిఫికెట్ వచ్చినా.. తక్కువ పర్సంటేజీతో ఉన్నవారు కొందరు ఉండడంతో తుది జాబితా విడుదలైతే.. తమ పేరు ఉంటుందో లేదో అనే ఉత్కంఠతో ఉన్నారు. ఇందులో వెయ్యి మంది మేరకు తమ సర్టిఫికెట్లు జారీ చేయకపోవడంతో దివ్యాంగుల పింఛన్ మంజూరు చేసే అధికారులు వీరి పేర్లు రిజెక్టు చేయకుండా హోల్డ్‌లో పెట్టినట్లు తెలిసింది. వీటిని మళ్లీ పరిశీలించి సర్టిఫికెట్లు వచ్చిన వారికి మంజూరు చేయడం, లేకుంటే హోల్డ్‌లో పెట్టి మరో అవకాశం ఇవ్వనున్నట్లు చర్చ జరుగుతుంది.
పైలేరియా బాధితుల్లో ఆందోళన
చేయూత పింఛన్ దరఖాస్తులతోపాటు పైలేరియా బాధితుల నుంచి కూడా దరఖాస్తులు తీసుకున్నారు. అయితే సదరు డాక్టర్ సర్టిఫికెట్‌తోపాటు, జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో ప్రత్యేక పరిశీలనా కేంద్రం ఏర్పాటు చేసి అక్కడికి వచ్చిన బాధితులను పరిశీలించారు. ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఇలా జిల్లాలో 1,320 మేరకు దరఖాస్తులు వచ్చాయి. గ్రామాల్లో చేయూత పింఛన్ మంజూరు కోసం విచారణ అధికారులు ఇంటింటికి రావడంతో.. తాము చేసుకున్న దరఖాస్తు ఏమైందని.. తమ వద్దకు విచారణ అధికారులు రావడం లేదని ఆందోళన చెందుతున్నారు. డాక్టర్ పరిశీలన పూర్తి అయ్యిందని, నేరుగా పింఛన్ మంజూరు అవుతుందని కొందరు చెబుతుండగా.. విచారణకు ఇంటికి వస్తారని మరికొందరు చెబుతున్నారు. దీంతో చివరకు పింఛన్ ఏమౌతుందో? అని పైలేరియా బాధితులు ఆందోళన చెందుతున్నారు.
తుది జాబితా సిద్ధం
కొత్త పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న అన్ని రకాల దరఖాస్తులను పరిశీలన పూర్తి దశకు చేరుకుంది. కలెక్టర్ ఆదేశాల మేరకు తుది జాబితా సిద్ధం చేస్తున్నాం. దివ్యాంగుల్లో కొందరికి సర్టిఫికెట్ అందలేదని వినతులు వచ్చాయి. వారిని హోల్డ్‌లో పెట్టి సర్టిఫికెట్ వచ్చిన తర్వాత పరిశీలించనున్నాం. ఎకై ్సజ్ శాఖ నుంచి గీత కార్మికులు, వైద్యారోగ్యశాఖ నుంచి పైలేరియా బాధితుల పింఛన్ తుది జాబితా వస్తుంది.
– మధుసూదన్ రాజు,
జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి


