మహబూబాబాద్ రూరల్ : మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తి జీవితాన్నే కాకుండా కుటుంబాన్ని, సమాజాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుందని ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు అన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించి, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన 5కే రన్ విజయవంతంగా ముగిసింది. రన్ అగనిస్ట్ డ్రగ్స్, సే నో టు డ్రగ్స్ అనే నినాదంతో ని ర్వహించిన రన్ సందర్భంగా ఎమ్మెల్యే మురళీనా యక్, ఎమ్మెల్సీ రవీందర్ రావు మాట్లాడారు. యు వత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ విద్య, క్రీడలు, ఉపాధి, లక్ష్య సాధనపై దృష్టి సారించాలని సూచించారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ఒక్క పోలీసు శాఖ బాధ్యత మాత్రమే కాదని, ప్రతీ పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ఎస్పీ శబరీష్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం యువత ఆరోగ్యం, ఆలోచనా విధానం, భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. జిల్లాలో ఎవరైనా గంజాయి వినియోగిస్తున్నా, విక్రయిస్తున్నా, అక్రమంగా రవాణా చేస్తున్నా లేదా మాదకద్రవ్యాల కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సమాచారం తెలిసినా కంట్రోల్ నంబర్ 87126 56999 కు ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతూ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదిలా ఉండగా.. 5కే రన్ లో భాగంగా నిర్వహించిన జుంబా డ్యాన్స్ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో ఉత్సాహాన్ని నింపింది. 5కే రన్ లో ప్రతిభ కనబరిచిన విజేతలకు ఎస్పీ శబరీష్ బహుమతులు అందజేశారు. 1మున్సిపల్ చైర్ పర్సన్ గుగులోత్ జ్యోతి, డీఎస్పీ తిరుపతిరావు, జిల్లాలోని సీఐలు, ఎస్సైలు, ప్రజాప్రతినిధులు, యువత, విద్యార్థుల సహా సుమారు వెయ్యి మందికిపైగా 5 కే రన్‌లో పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మురళీనాయక్, ఎమ్మెల్సీ రవీందర్ రావు
మానుకోటలో 5కే రన్


