కేయూ క్యాంపస్: శాస్త్రవేత్తలుగా ఆలోచించాలని ప్రయోగాల పరిశీలన, ధ్రువీకరించిన పరిజ్ఞానం ఆధారంగా స్టార్టప్‌లను అభివృద్ధి చేయాలని హైదరాబాద్ ఎంటర్‌ప్రెన్యూరాలజీ వ్యవస్థాపకుడు విశాల్‌రెడ్డి సూచించారు. కాకతీయ యూనివర్సిటీలోని కే హబ్, హైదరాబాద్‌లోని టీ హబ్ సౌజన్యంతో విద్యార్థుల్లో స్టార్టప్ ఆలోచనలు, నూతన ఆవిష్కరణలు, వ్యాపార నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో ఐడియా టు ప్రోటోటైప్ అంశంపై విద్యార్థులకు శుక్రవారం కేయూలోని సెనెట్ హాల్‌లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విశాల్‌రెడ్డి మాట్లాడుతూ.. స్టార్టప్‌లు కూడా జీవుల మాదిరిగానే నిరంతరం అభివృద్ధి చెందుతూ మార్పులకు అనుగుణంగా ఎదుగుతాయని తెలిపారు. వ్యాపార ఆలోచనలకు విజయవంతమైన ఎంట్రప్రెన్యూరాలజీ ఒక క్రమబద్ధమైన విధానమని వివరించారు. సమావేశంలో కె హబ్ డైరెక్టర్ ఆచార్య సవితాజ్యోత్స్న, రూసా నోడల్ అధికారి ఆచార్య మల్లికార్జున్‌రెడ్డి, కెహబ్ కోఆర్డినేటర్లు కిరణ్‌కుమార్, సిద్దార్థ తదితరులు పాల్గొన్నారు.
డివైడర్‌ను ఢీకొన్న బైక్.. విద్యార్థి మృతి
బంజారాహిల్స్: అతివేగంగా, నిర్లక్ష్యంగా బైక్ నడుపుతూ ముందున్న వాహనాలను ఓవర్ టేక్ చేయబోయి డివైడర్‌ను ఢీకొని విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పంథిని గ్రామానికి చెందిన నిఖిల్ అలియాస్ రాజా (24) ఎస్సార్‌నగర్‌లోని పీజీ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నాడు. తన స్నేహితుడు అజయ్‌తో కలిసి గురువారం రాత్రి తాను ఉండే హాస్టల్‌లో మద్యం తాగారు. అనంతరం రాత్రి 11 గంటల సమయంలో అజయ్ బైక్‌పై గండిపేటకు వెళ్లారు. అక్కడ మరోసారి తాగి గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లో తిరిగి హాస్టల్‌కు బయల్దేరారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్–45లోని డైలీ రిచువల్స్ సమీప ఫ్లైఓవర్ పైకి చేరుకోగానే అజయ్ అతివేగంగా, నిర్లక్ష్యంగా బైక్ నడుపుతూ ఇతర కార్లను ఓవర్‌టేక్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ముందు వెళ్తున్న గుర్తుతెలియని కారును వెనుక నుంచి ఢీకొట్టడంతో బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న ఇద్దరూ కిందపడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ నిఖిల్ మృతి చెందాడు. నిఖిల్ సోదరుడు వడిచర్ల శ్రవణ్‌కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
స్కూటీ అదుపుతప్పి
యువకుడి మృతి
చిల్పూరు: జనగామ జిల్లా చిల్పూరు మండలంలోని లింగంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కొమ్ముగుట్టకు చెందిన చాతెల్లి హరీశ్ (36) గురువారం అర్ధరాత్రి స్కూటీ అదుపుతప్పి కిందపడి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమ్ముగుట్టకు చెందిన హరీశ్ విందులకు వంటలు చేస్తుంటాడు. అందులో భాగంగా గురువారం చిల్పూరుగుట్ట వద్ద ఓపెళ్లి విందుకు వంటలు వండేందుకు వెళ్లి తిరిగి రాత్రి స్కూటీపై ఇంటికి వస్తుండగా గ్రామ సమీపంలో స్కూటీ ముందు బ్రేకులు పట్టుకోవడంతో ఎగిరి రోడ్డుమీద పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. తన వెంటఉన్నవారు 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారు జామున మృతి చెందాడు. హరీశ్‌కు భార్య రజని, ఏడాదిన్నర వయస్సు ఉన్న కుమారుడు, కూతురు ఉన్నారు. భార్య రజని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై శ్రవణ్‌కుమార్ తెలిపారు.


