మహబూబాబాద్ అర్బన్: పేదలకు అండగా నిలిచిన కల్యాణలక్ష్మి పథకాన్ని ఎలాంటి కోతలు, ఆంక్షలు లేకుండా యాథావిధిగా కొనసాగించాలని మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్ డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్‌ఎస్ నాయకలు సోమవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ఎత్తివేసేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తులం బంగారం హామీని వెంటనే అమలు చేయాలన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు అండగా నిలిచేందుకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ను సమర్థవంతంగా అమలు చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పథకాల అమలులో నిర్లక్ష్యం చేస్తూ, ఆర్హులైన లబ్ధిదారులను ఇబ్బందులు గురిచేస్తుందన్నారు. పేద ఇళ్లలో వెలుగులు నింపుతున్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేదంటే బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. పీఏసీఎస్ చైర్మన్ నాయిని రంజిత్, సర్పంచ్ షరీఫ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఎండీ ఫరీద్, బీఆర్‌ఎస్ నాయకులు, తెళ్ల శ్రీనివాస్, అశోక్‌నాయక్, కత్తుల ఏలేందర్, కిషన్ నాయక్, వెంకట్‌రెడ్డి, లింగస్వామి, జాకీర్, గోవర్ధన్, నవీన్, నరేష్, శ్యామ్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీలో శ్రావణమాసం సందడి
నెహ్రూసెంటర్: శ్రావణమాసం ప్రారంభం, బోనాలు, వరలక్ష్మీవ్రతంతో పాటు వరుస సెలవులు ఉండడంతో ఆర్టీసీకి ప్రయాణికుల రద్దీ పెరిగింది. మహబూబాబాద్ డిపో పరిధిలో 69 బస్సులుండగా.. ప్రతీరోజు 20వేల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను నడపనున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన
మహబూబాబాద్ అర్బన్/మహబూబాబాద్ రూలర్: మానుకోట మున్సిపల్ పరిధి ఈదులపూసపల్లిలోని సీత్లాతండాలో ప్రకృతి వ్యవసాయంపై డీఏఓ స్వర్ణ విజయచంద్ర రైతులకు సోమవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఏఓ మాట్లాడుతూ.. రైతులు సహజసిద్ధంగా లభించే ద్రావణాలను, సేంద్రియ ఎరువులను వాడాలని, అధిక మోతాదులో రసాయన ఎరువులు వాడడం వల్ల భూసారం తగ్గి పంట దిగుబడి తగ్గుతుందన్నారు. సహజసిద్ధంగా తయారు చేసిన జీవామృతం, ద్రావణాలను పంటలపై పిచికారీ చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఓ తిరుపతిరెడ్డి, ఏఈఓ పున్నమి, రైతులు కమ్లీబావ్‌సింగ్, అజ్మీరా కిషన్‌నాయక్, శ్రీను, అనిల్, కృషి, ప్రసాద్, అరుణ, శారద, బధ్రు తదితరులు పాల్గొన్నారు.
సర్పంచుల సంఘం జేఏసీ జిల్లా అధ్యక్షుడిగా రవినాయక్
కేసముద్రం: తెలంగాణ సర్పంచ్‌ల సంఘం జేఏసీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడిగా మండలంలోని బిచ్యనాయక్‌తండా జీపీ సర్పంచ్ వాంకుడోత్ రవినాయక్‌ను నియమించినట్లు ఆ సంఘం వ్యవస్థాపకుడు ఎస్. యాదయ్యగౌడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా సోమవారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో యాదయ్యగౌడ్, మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నట్లు సర్పంచ్ వాంకుడోత్ రవినాయక్ తెలిపారు.


