డ్రాఫ్ట్ ఓటరు
రెండు నియోజకవర్గాల్లో 4,36,956 మంది ఓటర్లు
● 35,650 మంది ఓటర్ల తొలగింపు
● 31,00మంది నూతనంగా నమోదు
● మహిళా ఓట్లే అధికం
● సెప్టెంబర్ 16వరకు అభ్యంతరాల స్వీకరణ
● కలెక్టర్ స్నేహ శబరీష్
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాల ముసాయిదా ఓటరు జాబితాను సోమవారం కలెక్టర్ స్నేహ శబరీష్ విడుదల చేశారు. ఈ జాబితాపై అభ్యంతరాలు ఉంటే సెప్టెంబర్ 16 తేదీ వరకు స్వీకరించి పరిశీలిస్తామని, అవసరమైతే జాబితాను సవరించి తుది జాబితా విడుదల చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
రెండు చోట్ల మహిళలే అధికం
కలెక్టర్ స్నేహ శబరీష్ విడుదల చేసిన డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో మహబూబాబాద్, డోర్నకల్ రెండు నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. డోర్నకల్ నియోజకవర్గంలోని ఏడు మండలాల పరిధిలో 272 పోలింగ్ స్టేషన్లు ఉండగా.. ఇందులో 1,01,527 మంది పురుషులు, 1,03,552 మంది మహిళా ఓటర్లు మొత్తం 2,05,085 మంది ఉన్నారు. మహబూబాబాద్ నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలో 299 పోలింగ్ స్టేషన్లు ఉండగా.. 1,13,940 మంది పురుషులు, 1,17,898 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. రెండు నియోజకవర్గాలు కలిపి 2,15,467 మంది పురుషులు, 2,21,450 మంది మహిళలు ఉన్నారు. ఈ లెక్కన డోర్నకల్‌లో 2,025 మంది, మహబూబాబాద్‌లో 3,958 మంది మొత్తం 5,983 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.
తగ్గిన ఓటర్లు
గత అసెంబ్లీ ఎన్నికల ఓటరు జాబితాతో పోలిస్తే జిల్లాలో ఓటర్లు తగ్గారు. సర్ ప్రక్రియ ద్వారా ఒక ఓటరుకు ఓకే చోట ఓటు ఉండాలనే నిబంధన, చనిపోయిన వారి ఓట్లను తొలగించడం మొదలైన పరిణామాలతో ఓట్లు తగ్గినట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో డోర్నకల్ నియోజకవర్గంలో 2,19,264 మంది ఓటర్లు ఉండగా ప్రస్తుత జాబితాలో 2,05,085 మంది ఓటర్లు ఉన్నారు. అదే విధంగా మహబూబాబాద్‌లో గత అసెంబ్లీ ఎన్నికల్లో 2,53,342 మంది ఓటర్లు ఉండగా ప్రస్తుత జాబితాలో 2,31,871 మంది ఉన్నారు. మొత్తంగా డోర్నకల్‌లో 14,179, మహబూబాబాద్‌లో 21,471 ఓట్లు తగ్గాయి. గతంలో మొత్తం 4,72,606 మంది ఓటర్లు ఉంటే ప్రస్తుత జాబితాలో 4,36,956 మంది ఉన్నారు. అంటే గతంతో పోలిస్తే 35,650 మంది ఓటర్లు తగ్గారు.
0.70శాతం యువ ఓటర్లు
రెండు నియోజకవర్గాల్లో సవరణ జాబితా ప్రకారం 18–19 సంవత్సరాల వయస్సు ఉన్నవారు అంటే కొత్తగా ఓటు నమోదు చేసుకున్నవారిని పరిశీలిస్తే మొత్తం ఓటర్లలో 0.70శాతం ఓట్లు కొత్తగా నమోదయ్యాయి. డోర్నకల్ నియోజకవర్గంలో 1488 మంది, మహబూబాబాద్‌లో 1612 మంది మొత్తం 3100 కొత్త ఓటర్లు ఉన్నారు. అదే విధంగా సీనియర్ సిటిజన్లు డోర్నకల్‌లో 1227 మంది, మహబూబాబాద్‌లో 1395 మంది ఉన్నారు. అదేవిధంగా దివ్యాంగులు డోర్నకల్ నియోజకవర్గంలో 5570మంది, మహబూబాబాద్‌లో 5855మంది.. మొత్తంగా 1,1425 మంది ఉన్నారు.
మండలాల వారీగా ఓటర్లు
మహబూబాబాద్ నియోజకవర్గం
మండలం పీఎస్‌లు పురుషులు మహిళలు ఇతరులు మొత్తం
గూడూరు 55 22,063 22,635 01 44,699
ఇనుగుర్తి 25 8,094 8,178 01 16,273
కేసముద్రం 57 22,238 22,538 00 44,776
మానుకోట 114 42,186 44,883 31 87,100
నెల్లికుదురు 46 18,589 18,877 00 37,466
దంతాలపల్లి 02 770 787 00 1,557
డోర్నకల్ నియోజకవర్గం
చిన్నగూడూరు 16 5,990 6,027 00 12,017
దంతాలపల్లి 30 11,201 11,546 00 22,747
డోర్నకల్ 43 17,804 18,381 04 36,189
కురవి 57 19,037 19,759 00 38,796
మరిపెడ 76 27,329 27,430 00 54,750
నర్సింహులపేట 26 11,316 11,538 01 22,855
సీరోలు 24 8,859 8,871 01 17,731


