● ఎస్పీ శబరీష్
కురవి: ప్రజల నుంచి వచ్చే ప్రతీ ఫిర్యాదును పరిశీలించి పరిష్కరించాలని ఎస్పీ శబరీష్ ఆదేశించారు. సోమవారం కురవి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్‌స్టేషన్‌లోని గదులు, రికార్డుల, సిబ్బంది విధుల నిర్వహణను పరిశీలించారు. ముందుగా రిసెప్షన్ విభాగాన్ని పరిశీలించారు. స్టేషన్‌కు వచ్చే ప్రజల ఫిర్యాదులు, వాటి పరిష్కార స్థితి, పెండింగ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుల్లో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్టేషన్‌లోని సీసీటీఎన్‌ఎస్ 2.0, స్టేషన్ రైటర్ విభాగం, ఇతర రికార్డులు పరిశీలించి సిబ్బందిని విధులకు సంబంధించిన పలు అంశాలపై ప్రశ్నించి వారి పనితీరును సమీక్షించారు. కేసులు, పిటిషన్లు, స్టేషన్‌కు సంబంధించిన సమాచారాన్ని సీసీటీఎన్‌ఎస్ 2.0లో ఎప్పటికప్పుడు సక్రమంగా నమోదు చేసి అప్‌డేట్ చేయాలని సూచించారు. సీసీ టీవీ కెమెరాల పనితీరు, కవరేజీ, రికార్డింగ్ పరిస్థితిని పరిశీలించి సీసీ టీవీలను నిరంతరం పర్యవేక్షిస్తూ సక్రమంగా పనిచేసేలా చూడాలన్నారు. నేరాల నియంత్రణ, నేరాల దర్యాప్తులో సీసీటీవీ పుటేజీని సమర్థవంతంగా వినియోగించుకోవాలని తెలిపారు. అనంతరం జనరల్ డైరీ, స్టేషన్ రికార్డులు, రౌడీషీట్లు, సస్పెక్ట్ షీట్లు, పాయింట్‌బుక్స్‌ను పరిశీలించారు. అన్ని రికార్డులను ఎప్పటికప్పడు అప్‌డేట్ చేసి పూర్తిస్థాయిలో నిర్వహించాలని ఎస్సై సతీష్‌కు సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేకంగా సమీక్షించి, ప్రమాదాలకు అవకాశం ఉన్న ప్రాంతాలు, బ్లాక్ స్పాట్ల్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో పర్యవేక్షణ పెంచి వాహనదారులకు అవగాహన కల్పించాలన్నారు. గంజాయి ఓటర్ల వివరాలను సేకరించి వారిపై నిఘా పెట్టాలన్నారు. మాదకద్రవ్యాల రవాణా, వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని, విలేజ్ పోలీస్ ఆఫీ సర్స్ ద్వారా గ్రామాల్లో పోలీసు నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. ప్రజావాణి ఫిర్యాదులు పెండింగ్ ఉండవద్దన్నారు.


