నెల రోజులపాటు ఆలయాల్లో పూజలు
మహబూబాబాద్ రూరల్ : భక్తులు అత్యంత పుణ్యప్రదంగా, విశేషంగా భావించే శ్రావణ మాసం గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈమేరకు నెల రోజులపాటు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అర్చనలు, వ్రతాలు, ఇతర దైవిక కార్యక్రమాలు జరగనున్నాయి. శ్రావణమాసం సందర్భంగా అర్చకులు దేవాలయాలను ముస్తాబు చేస్తుండగా.. జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మికశోభ సంతరించుకోనుంది.
శ్రీరామ ఆలయంలో ఏడు వారాల వ్రతం..
శ్రావణ మాసం సందర్భంగా ఈ నెల 15వ తేదీ నుంచి మానుకోట శ్రీరామ ఆలయంలో శ్రీవేంకటేశ్వర స్వామివారి దివ్యసన్నిధిలో సామూహిక ఏడు వారాల వ్రతం నిర్వహించనున్నట్లు అర్చకుడు కృష్ణప్రసాద్ తెలిపారు. సెప్టెంబరు 26వ తేదీ వరకు వ్రతం జరుగుతుందన్నారు. వ్రతంలో పాల్గొనే భక్తులు ఆలయంలో తమ పేర్లు ముందుగా నమోదు చేసుకోవాలని సూచించారు.
22న అవగాహన సదస్సు
మహబూబాబాద్ రూరల్: జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లుగా ఎంపికై న ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఈ నెల 22న ఒక రోజు అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి షాలిని షాకెల్లి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టరేట్ కాంప్లెక్స్ (ఐడీఓసీ)లో ఉదయం 10 గంటలకు సదస్సు ప్రారంభమవుతుందని, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, కలెక్టర్, ఎస్పీ ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవావాధికార సంస్థ, రాష్ట్ర విద్యాశాఖతో చేసుకున్న ఒప్పందం మేరకు చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్లుగా ఎంపికై న ఉపాధ్యాయులందరూ అవగాహన సదస్సుకు హాజరుకావాలని కోరారు.
పాఠశాలలోకి పాము.. విద్యార్థుల భయాందోళన
మరిపెడ రూరల్: మండలంలోని చిల్లంచర్ల ఉన్నత పాఠశాలలోకి బుధవారం ఓ పాము ప్రవేశించడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురయ్యారు. పాము సంచరించడాన్ని గమనించిన ఉపాధ్యాయుడు శ్రీకాంత్ చాకచక్యంగా వ్యవహరించి దానిని పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. దీంతో సమయస్ఫూర్తితో వ్యవహరించి పామును పట్టుకున్న ఉపాధ్యాయుడిని విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు. గ్రామ శివా రులోని చెరువు శిఖం ప్రాంతంలో పాఠశాల నిర్మించారని, ప్రహరీ లేకపోవడంతో తరచూ విషపురుగులు లోపలికి ప్రవేశిస్తున్నాయని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.
జిల్లా సహకార అధికారి సరెండర్
మహబూబాబాద్ రూరల్ : జిల్లా సహకార (కో ఆపరేటివ్) అధికారిగా విధులు నిర్వహిస్తున్న ఎ.విజయకుమారిని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ కలెక్టర్ స్నేహశబరీష్ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పరిపాలనకు సంబంధించిన ముఖ్యమైన అంశాల్లో ఉన్నతాధికారుల సూచనలను పాటించకపోవడం, జిల్లా యంత్రాంగానికి అవసరమైన సమాచారాన్ని సకాలంలో తెలియజేయకపోవడంపై నివేదిక అందినట్లు ధ్రువీకరించారు. అవసరమైన సందర్భాల్లో ముందస్తు అనుమతి పొందకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం, విధుల నిర్వహణలో విధానపరమైన లోపాలకు పాల్ప డడం వంటి అంశాలపై కలెక్టర్ కార్యాలయం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆమె చర్యల వల్ల జిల్లా పరిపాలనకు ఇబ్బందులు ఏర్పడడంతో పాటు, జిల్లాలో వివిధ ప్రభుత్వ కార్యక్రమాల సమర్థవంతమైన అమలు, పర్యవేక్షణపై ప్రతి కూల ప్రభావంపడిందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కో ఆపరేటివ్ అధికారి ఎ.విజయకుమారిని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల ప్రతులను డీసీఓ, హైదరాబాద్‌లోని స్పెషల్ కమిషనర్ ఫర్ కో ఆపరేషన్ అండ్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ కార్యాలయానికి పంపించారు.


