మహబూబాబాద్: అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలనే ప్రధాన లక్ష్యంతో మహిళ అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్, పోషణ్ ట్రాకర్, ఆరోగ్యలక్ష్మి తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈమేరకు ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమంలో భాగంగా పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. జిల్లాలో మంత్రి ధనసరి సీతక్క చేతుల మీదుగా కార్యక్రమం ప్రారంభించారు.
1,437 కేంద్రాలు
జిల్లాలో ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయాలు ఉన్నాయి. వాటి పరిధిలో 1,437 కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల పరిధిలో జీరో నుంచి ఆరు నెలలలోపు పిల్లలు 3,006 మంది, ఏడు నెలల నుంచి మూడు సంవత్సరాలలోపు వారు 18,944మంది, మూడేళ్ల నుంచి ఆరు సంవత్సరాల లోపు పిల్లలు 18,938 మంది ఉన్నారు. గర్భిణులు 4,499మంది, బాలింతలు 2,732 మంది ఉన్నారని అధికారులు తెలిపారు. తల్లీబిడ్డ ఆరోగ్యం, పిల్లలు, గర్భిణులు, బాలింతలు ఆరోగ్యం, వారికి పౌష్టికాహారం ఇవ్వడం వంటి కార్యక్రమాలను అంగన్‌వాడీ టీచర్లు నిర్వహిస్తున్నారు. యాప్‌లలో వివరాల నమోదుతో పాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
పోషణ్ పక్వాడ పోస్టర్ ఆవిష్కరణ..
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ప్రధాన సమావేశ మందిరంలో ఈనెల 9న మంత్రి ధనసరి సీతక్క చేతుల మీదుగా పోషణ్ పక్వాడ కార్యక్రమం పోస్టర్లను ఆవిష్కరించి ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాగా కార్యక్రమం విజయవంతం చేయడం అధికారులకు సవాల్‌గా మారింది.
ఈనెల 9 నుంచి 23వ తేదీ వరకు..
● ఈనెల 9 నుంచి 23వ తేదీ వరకు పోషణ్ పక్వాడ కార్యక్రమం నిర్వహిస్తున్నారు
● ఈనెల 9న కార్యక్రమం పోస్టర్ల ఆవిష్కరణ, కార్యక్రమం ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు
● 10న అంగన్‌వాడీ కేంద్రాల్లో అమ్మమ్మ–నానమ్మ మాటల్లో పోషణ్ కథలు చెప్పించారు
● 11న గర్భిణులు, పిల్లల కోసం ప్రత్యేక పోషణ–ఆరోగ్య శిబిరాల నిర్వహణ కార్యక్రమాలు
● 13న వంటల పోటీలు, చిరుధాన్యాలను ఉపయోగించి వివిధరకాల ఆహారపదార్థాలు తయారు చేయడంపై ప్రదర్శన కార్యక్రమాలు
● 14న జంక్, ప్యాకేజ్డ్ ఆహారం వల్ల కలిగే నష్టాలపై అవగాహన సదస్సు, పోషకాహారంపై అవగాహన ర్యాలీ నిర్వహణ
● 15న పిల్లల అభివృద్ధి, మైలు రాళ్లను గుర్తించడానికి డ్రైవ్ నిర్వహించాలి
● 16న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు బాల్య దశ సంరక్షణ, విద్యపై అవగాహన కార్యక్రమం
● 17న తల్లి, శిశువు పరస్పర సంభాషణలు, ఆటల ఆధారిత అభ్యసన ప్రదర్శనలు
● 18న ఆట ఆధారిత అభ్యసన కార్యక్రమాల ప్రాముఖ్యతపై చర్చ
● 20న అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రీస్కూల్ సంసిద్ధత కార్యకలాపాలు, లేదా గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం
● 21న పంఖుడి పోర్టల్‌పై అవగాహన కార్యక్రమాలు
● 22న పాఠశాలలు, అంగన్‌వాడీలు, పంచాయతీల్లో మొబైల్ వాడకం వల్ల కలిగే ప్రయోజనాలపై కౌన్సెలింగ్, సమావేశాలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు
● 23న నో స్క్రీన్ అవర్, ఫ్యామిలీ ప్లే టైమ్ ప్రచారం, బహిరంగ ఆటలు, శారీరక కార్యకలాపాలు, క్రీడలు ఇతరత్రా కార్యక్రమాలు 15 రోజుల పాటు నిర్వహిస్తారు. ఆ కార్యక్రమాల ఫొటోలు, వీడియోలు తీసి పోర్టల్‌లో నమోదు చేస్తారు.
విజయవంతం చేయాలి
పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా కార్యక్రమం నిర్వహిస్తుంది. జిల్లాలో మంత్రి చేతుల మీదుగా ప్రారంభించడం వల్ల మరింత బాధ్యతగా రాష్ట్రంలో జిల్లాను ముందంజలో ఉంచేందుకు తగు ఏర్పాట్లు చేశాం. ప్రధానంగా పౌష్టికాహారం అందించడం, ఆరోగ్యం, వ్యాయాయం, పరిశుభ్రత, ఇతరత్రా విషయాలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యం. – సబిత, డీడబ్ల్యూఓ
మంత్రి సీతక్క చేతుల మీదుగా పోషణ్ పక్వాడ కార్యక్రమం ప్రారంభం
ఈనెల 9నుంచి 23వ తేదీ వరకు నిర్వహణ
పోషకాహారం అందించేలా చర్యలు
ప్రోగ్రాం విజయవంతంపై అఽధికారుల దృష్టి


