● డీఏఓ సరిత
కేసముద్రం: రైతులు నాణ్యమైన మక్కలను కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని డీఏఓ సరిత అన్నారు. శుక్రవారం కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చుట్టుపక్కల మండలాల నుంచి అధిక సంఖ్యలో రైతులు మక్కలను తీసుకురావడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని, మరో మూడు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ఎకరాకు 35 క్వింటాళ్లను ఖరీదు చేయాలని పలువురు రైతులు కలెక్టర్‌ను కోరారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరి ష్కారం అయ్యే విధంగా చూస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఏడీఏ శ్రీనివాసరావు, ఏఓ వెంకన్న, స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ అమరలింగేశ్వర్‌రావు, సీఈఓ మల్లారెడ్డి, ఏఈఓ రాజేందర్ పాల్గొన్నారు.
గడ్డిమందు విక్రయిస్తే కఠిన చర్యలు
బయ్యారం: జిల్లాలోని ఎరువుల షాపుల్లో నిషేధిత గడ్డిమందు(పారాక్వాట్)ను విక్రయిస్తే సంబంధిత డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఏఓ సరిత హెచ్చరించారు. మండలంలోని బయ్యారం, గంధంపల్లి–కొత్తపేట గ్రామాల్లోని ఎరువుల షాపులను శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. మండలంలోని కస్తూరినగర్, కంబాలపల్లి గ్రామాల్లోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను డీఏఓ పరిశీలించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా కొనుగోళ్లు నిర్వహించాలన్నారు.


