కాలేజీలో ఫ్యాకల్టీని వెంటనే మార్చాలి
● టీటీడబ్ల్యూఆర్‌సీఈ విద్యార్థినుల డిమాండ్
వరంగల్: ఐఐటీ, నీట్ లాంటి ఉన్నత చదువుకు గిరిజన విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రారంభించిన తెలంగాణ ట్రైబల్ వెల్‌ఫేర్ రెసిడెన్షియల్ కాలేజీ ఆఫ్ ఎక్సలెన్సీ(టీటీడబ్ల్యూఆర్‌సీఈ)కాలేజీల్లో వెంటనే ఫ్యాకల్టీ మార్చాలని పలువురు విద్యార్థినులు డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం వరంగల్ 3వ డివిజన్ పరిధి హనుమకొండ పెద్దమ్మగడ్డలోని టీటీడబ్ల్యూఆర్‌సీఈ కాలేజీ విద్యార్థినులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సరైన ఫ్యాకల్టీ లేకపోవడంతో తాము ఉన్నత విద్యావకాశాలు కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ప్రస్తుత ఫ్యాకల్టీ బోధన తమకు ఏమాత్రం అర్థం కావడం లేదన్నారు. తమ ఇబ్బందులను ప్రిన్సిపాల్, ఆర్‌సీఓల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అందుకే విసుగెత్తి తాము ఆందోళన చేపట్టామన్నారు. ఆందోళనపై సమాచారం అందుకున్న ఆర్‌సీఓ డీఎస్.వెంకన్న, ప్రిన్సిపాల్‌తో పాటు పలువురు అధ్యాపకులు వచ్చి విద్యార్థినులకు సర్ది చెప్పడంతో వారు కాలేజీలోకి వెళ్లారు. ఈవిషయంపై ఆర్‌సీఓ డీఎస్.వెంకన్నను వివరణ కోరగా గతేడాది వరకు కాంట్రాక్ట్ లెక్చరర్లు ఉన్నారని, ఇప్పుడు టీఎస్‌పీఎస్‌సీ నుంచి వచ్చిన అధ్యాపకులు బోధిస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు అధ్యాపకులను సమన్వయం చేస్తామని తెలిపారు.


