పాముకాటుతో రైతు మృతి
నల్లబెల్లి: పాముకాటుతో ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని లెంకాలపల్లిలో చోటు చేసుకుంది. ఎస్సై గోవర్ధన్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన యాదండ్ల చిన్న కొమురయ్య(50) ఈ నెల 19వ తేదీన తన వ్యవసాయ భూమిలో మొక్కజొన్న సాగు పనుల్లో ఉన్నాడు. ఈక్రమంలో అక్కడే ఉన్న ఎడ్లకు వేత వేసేందుకు యత్నిస్తుండగా చేతిపై పాము కాటువేసింది. వెంటనే తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన కుటుంబీకులు వెంటనే 108లో వరంగల్ ఎంజీఎం తరలింకారు. చికిత్స పొందుతున్న క్రమంలో పరిస్థితి విషమించి సోమవారం మృతి చెందాడు. ఈ ఘటనతో కుటుంబంతోపాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య అరుణ, కుమారులు మునేందర్, రాజేందర్ ఉన్నారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


