కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
బచ్చన్నపేట: కుటుంబ కలహాలతో ఓ మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈసంఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని సాల్వాపూర్ గ్రామంలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన సత్యనారాయణ కూతురు అనుశ్రీ (21)ని సాల్వాపూర్ గ్రామానికి చెందిన గూడెపు రాజమణి సత్తయ్య దంపతుల పెద్ద కుమారుడు అజయ్‌కు ఇచ్చి 13 నెలల క్రితం వివాహం చేశారు. ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవలు జరగగా పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి అనుశ్రీని భర్త అజయ్ వద్దకు పంపించారు. సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అనుశ్రీ ఉరివేసుకొంది. విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు భారీగా వచ్చి అజయ్‌లో ఇంటిని, సామగ్రిని ధ్వంసం చేశారు. అనుశ్రీ మృతికి అత్తింటి సభ్యులే కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనా స్థలం వద్ద నర్మెట సీఐ అబ్బయ్య, ఎస్సై ఎస్‌కే అబ్దుల్ హమీద్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హమీద్ తెలిపారు.


