సరైన ఉద్యోగం రావడం లేదని యువకుడు..
ఖానాపురం: సరైన ఉద్యోగం రావడం లేదనే కారణంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని రేవతండాలో చోటుచేసుకుంది. ఎస్సై రఘుపతి కథనం ప్రకారం.. తండాకు చెందిన బానోత్ రాజేందర్(23) బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. సరైన ఉద్యోగం రాకపోవడంతో కొంత కాలంగా ఇబ్బంది పడుతున్నాడు. ఈక్రమంలో 20 రోజుల క్రితం స్వగ్రామం వచ్చాడు. ఈనెల 6న తల్లికి హైదరాబాద్‌కు వెళ్తున్నానని చెప్పాడు. ఆ తర్వాత ఫోన్ పనిచేయలేదు. ఇదే సమయంలో యువకుడి తల్లి తమ వ్యవసాయ బావి వద్దకు వెళ్లగా దుర్వాసన వచ్చింది. దీంతో బావిలోకి చూడగా రాజేందర్ మృతదేహం కనిపించింది. భయాందోళనకు గురై తండాకు వెళ్లి చుట్టుపక్కల వారికి చెప్పగా వారు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై రఘుపతి ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి తల్లి తార ఫిర్యాదు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రఘుపతి సోమవారం తెలిపారు.


