అంతా గందరగోళం!
సాక్షి, మహబూబాబాద్: గత విద్యాసంవత్సరం పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాల కోసం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు సాగిన విద్యాశాఖ ఈ ఏడాది వెనుకబడిపోయింది. ఇందులో పంచాయతీ ఎన్నికలు, ఉపాధ్యాయులకు శిక్షణ, డ్యూటీల పేరుతో 15రోజులకు పైగా పాఠాలు సాగలేదు. దీనికి తోడు మారిన అధికారులు, ఖాళీలు, సమన్వయలోపం.. అంతా వార్షిక పరీక్షల ఫలితా లపై ప్రభావం పడే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
గత ఏడాది ముందస్తు ప్రణాళిక..
2022–23 విద్యా సంవత్సరంలో జిల్లా విద్యార్థులు 85.54శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో 22వ స్థానంలో నిలిచారు. దీంతో ఫలితాలపై రాష్ట్ర ఉన్నతాధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందుకు బాధ్యులుగా సబ్జెక్టు టీచర్లను మొదలుకొని హెచ్‌ఎంలు, జిల్లా విద్యాశాఖ అధికారుల వరకు సంజాయిషీ ఇవ్వాల్సి వచ్చింది. ఆతర్వాత సంవత్సరం కాస్త మెరుగుపడి రాష్ట్రంలో 12వ స్థానంలో నిలిచారు. అదే ఊపుతో గత విద్యా సంవత్సరం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఏఏఈఈఆర్‌టీ రూపొందించిన కరదీపికలతోపాటు, ప్రత్యేక పరీక్ష పత్రాలు తయారు చేసి పరీక్షలు నిర్వహించారు. కేజీబీబీ, మోడల్ స్కూల్స్‌తోపాటు, పలు పాఠశాలల్లో వెనకబడిన విద్యార్థులకు వరంగల్, హనుమకొండ నుంచి సబ్జెక్టులో ప్రావీణ్యం కలిగిన ఉపాధ్యాయులను పిలిపించి ప్రత్యేక క్లాసులు చెప్పించారు. వీటన్నింటి ఫలితంగా 99.29 ఉత్తీర్ణత శాతంతో జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. దీంతో పాటు ప్రతిష్టాత్మక బాసర ట్రిపుల్‌ఐటీలో జిల్లాకు చెందిన 175 మంది విద్యార్థులు సీటు సాధించి ప్రభుత్వ పాఠశాలల సత్తా చాటారు.
మరో 80రోజుల్లో పరీక్షలు
గత విద్యాసంవత్సరంలో పదో తరగతి వార్షిక పరీక్షలకు వంద రోజుల ముందుగానే ప్రత్యేక ప్రణాళిక తయారు చేసుకొని అమలు చేసిన విద్యాశాఖ ఈ ఏడాది అంత ఉత్సాహం చూపించడం లేదు. గతంలో డిసెంబర్ నాటికే సిలబస్ పూర్తి చేయించి వందరోజులకు ముందుగా స్లిప్ టెస్ట్‌లు పెట్టారు. ప్రత్యేక తరగతులు నిర్వహించారు. దసరా సెలవుల తర్వాత నుంచి ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించారు. ఇందుకోసం దాతల సహకారం తీసుకొని విద్యార్థులకు అల్పాహారం పెట్టారు. కాగా, ఈ ఏడాది మార్చి 14నుంచి పరీక్షల నిర్వహణ టైంటేబుల్ విడుదల చేసింది. ఈ లెక్క ప్రకారం సరిగ్గా 80రోజుల్లో పరీక్షలు జరగనున్నాయి. కానీ ఇప్పటి వరకు ప్రణాళికలే తయారు చేయకపోవడం శోచనీయం. విద్యార్థుల స్టడీ మెటీరియల్ కోసం దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
మూడేళ్లుగా పదో తరగతి ఫలితాల వివరాలు..
మరో 80రోజుల్లో పదో తరగతి
వార్షిక పరీక్షలు
ఎన్నికలతో అంతా అస్తవ్యస్తం
ముందుకు సాగని ప్రణాళికలు
మెటీరియల్ కోసం దాతలవైపు చూపు
సిలబస్ గురించి ఆలోచించరా?
గత సంవత్సరం పనిచేసిన జిల్లా విద్యాశాఖ అధికారి పదవీ విరమణ పొందారు. ఆయన స్థానంలో వచ్చిన దక్షిణామూర్తి జిల్లా విద్యాశాఖలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా.. జిల్లానుంచి బదిలీపై వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఆ తర్వాత తప్పని పరిస్థితిలో స్వచ్ఛంద పదవీ విరమణ పొంది వెళ్లిపోయారు. అయితే జిల్లా పరిస్థితిని చూసి జిల్లాకు వచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో ఏడీ రాజేశ్వర్‌కు డీఈఓ బాధ్యతలు అప్పగించారు. ఆయన బాధ్యతలు తీసుకోగానే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రావడం.. ఈ పనులపై 15రోజులకుపైగా కాలయాపన జరిగింది. దీనికి తోడు ఏఎంఓగా పనిచేసిన ఆజాద్ దీర్ఘకాలిక సెలవుపెట్టి వెళ్లిపోయారు. అలాగే ఉద్యోగులు, కో–ఆర్డినేటర్ల మధ్య సమన్వయం లేకపోవడంతో ఇప్పటివరకు ప్రణాళిక కాదుకదా.. అసలు సిలబస్ గురించి ఆలోచించిన వారు లేకపోయారనే విమర్శలు వస్తున్నాయి.
విద్యా సంవత్సరం పరీక్ష ఉత్తీర్ణులు శాతం రాష్ట్రంలో
రాసిన వారు స్థానం
2022–23 8,461 7,227 85.54 22
2023–24 8,178 7,738 94.62 12
2024–25 8,184 8,126 99.29 01
ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం..
నేను కొత్తగా బాధ్యతలు తీసుకున్నాను. ఆలోపే పంచాయతీ ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు ప్రత్యేక ప్రణాళిక తయారు చేసే పనిలో ఉన్నాం. సిలబస్‌ను నాలుగు భాగాలుగా విభజించి టెస్ట్‌లు నిర్వహిస్తాం. జిల్లా ఉన్నతాధికారులతో హైస్కూల్ హెచ్‌ఎంల సమావేశం నిర్వహించి టెన్త్ ఫలితాల ప్రాముఖ్యతను వివరిస్తాం. ఈ ఏడాది కూడా మంచి ఫలితాలు సాధించే దిశగా ప్రణాళికలు తయారు చేసి ముందుకు వెళ్తాం. – రాజేశ్వర్, డీఈఓ


