
ఆహ్లాదం.. ఆమడ దూరం!
● పార్కులో దెబ్బతిన్న పరికరాలు
● చిన్నారులు ఆడుకునేందుకు
వసతులు కరువు
● మున్సిపాలిటీ పార్కు పరిస్థితి దయనీయం
తొర్రూరు: ఆహ్లాదం పంచాల్సిన పార్కులు సమస్యలకు నిలయంగా మారాయి. ముఖ్యంగా తొర్రూరు పట్టణంలోని యతిరాజారావు పార్కు నిర్వహణ అధ్వానంగా మారింది. రూ.లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన చిన్నారుల క్రీడా పరికరాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. చిన్నారులు, మహిళలు, యువకులు, ఉద్యోగులు ఉదయం, సాయంత్రం పార్కులో వాకింగ్ చేస్తున్నారు. అయితే వ్యాయామం చేసేందుకు కనీస సదుపాయాలు లేవు. మూడేళ్ల క్రితం టీయూఎఫ్‌ఐడీసీ నిధులు రూ.2 కోట్లతో పార్కులో సౌకర్యాల కల్పనతో పాటు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. పిల్లలు ఆడుకునేందుకు, పెద్దలు వ్యాయామం, సేద తీరేందుకు వీలుగా సౌకర్యాలు కల్పించారు. వీటి నిర్వహణ బాధ్యత మున్సిపాలిటీ నే చూడాల్సి ఉంటుంది. అయితే అధికారులు దృష్టి సారించకపోవడంతో పరికరాలు పాడయ్యాయి.
పార్కు నిర్వహణ అధ్వానం..
మూడేళ్ల క్రితం యతిరాజారావు పార్కులో ఉద్యానవనం ఏర్పాటు చేశారు. విలువైన పూల మొక్కలు, గడ్డి జాతులు, రంగు రంగుల కళాకృతులు, కుర్చీలు, నీటిని వెదజల్లే ఫౌంటేన్‌తో పార్కు ఆహ్లాద వాతావరణం పంచేది. చిన్నారులకు క్రీడా పరికరాలతో ఆటవిడుపుగా ఉండేది. వ్యాయామం కోసం ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. నిర్వహణ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తుండటంతో అధ్వానంగా మారాయి. పార్కులోని చిన్నారుల ఆట పరికరాలు, వ్యాయామ పరికరాలు నిర్వహణ లోపంతో నిరుపయోగంగా మారాయి. క్లైంబింగ్ ప్రేమ్‌తో పాటు పలు పరికరాలు తుప్పు పట్టాయి. ఫౌంటెన్ లైట్లు పగిలిపోయాయి. మూత్రశాలలకు నీటి సదుపాయం కల్పించకపోవడంతో నిరుపయోగంగా మారాయి. నిర్వహణ లేకపోవడంతో గడ్డి పెరిగి అధ్వానంగా మారింది. పాములు, విష పురుగులకు నివాసంగా మారింది. పార్కులోని జంతువుల బొమ్మలు దెబ్బతిన్నాయి. గ్రౌండ్‌లోని వాకింగ్ దారిలో మొక్కలు మొలిచి అధ్వానంగా మారింది. ఓపెన్ జిమ్ పరికరాలు తుప్పు పడుతున్నాయి.
మరమ్మతులు చేపడతాం
యతిరాజారావు పార్కులో అన్ని వసతులు కల్పిస్తాం. చిన్నారుల ఆట పరికరాలు విరిగిపోయాయి. వాటిని తిరిగి ఏర్పాటు చేస్తాం. ఉదయం, సాయంత్రం సమయాల్లో పార్కు తెరిచి ఉంచుతున్నాం. స్థానికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం. వసతుల కల్పనపై కలెక్టర్‌కు విన్నవిస్తాం.
– శ్యాంసుందర్, తొర్రూరు మున్సిపల్ కమిషనర్

ఆహ్లాదం.. ఆమడ దూరం!

ఆహ్లాదం.. ఆమడ దూరం!

ఆహ్లాదం.. ఆమడ దూరం!