
సైబర్ వలలో ఆలయ ఉద్యోగి
కురవి: సైబర్ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా బాధితులు మోసపోతున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న కట్ట జగన్నాధం సైబర్ వలలో చిక్కుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి.. కరీంనగర్ జిల్లాకు చెందిన కట్ట జగన్నాథం గత కొన్నేళ్ల నుంచి కురవిలోని భద్రకాళీ సమేత శ్రీవీరభద్రస్వామి ఆలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 26న (మంగళవారం) సైబర్ నేరగాడు 6003447660 నంబర్ నుంచి ఫోన్ చేసి ‘హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నుంచి మాట్లాడుతున్నా.. మీకు హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు ఉంది కదా.. దాని లిమిట్ పెంచుతాం.. ఇది అంతా ఉచితమే’ అని చెప్పాడు. దీంతో జగన్నాధం అతడి మాటలను నమ్మాడు. అతడు (సైబర్ నేరగాడు) సెల్‌ఫోన్‌లో హెచ్‌డీఎఫ్‌సీ ‘మై కార్డ్స్’ యాప్ ఓపెన్ చేయమని చెప్పడంతో తన మొబైల్‌లో ఆ యాప్ లేదని బాధితుడు తెలిపాడు. సెల్‌ఫోన్ వాట్సాప్‌కు లింక్ పంపిస్తా ఓపెన్ చేయమని చెప్పడంతో జగన్నాధం ఓపెన్ చేశాడు. వెంటనే మైకార్డ్స్ యాప్ లింక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు గుర్తులతో వచ్చింది. అతను చెప్పినట్లే బాధితుడు లింక్‌ను ఓపెన్ చేయడంతో అందులో రూ.6.89 లక్షలు క్రెడిట్ లిమిట్ పెరిగినట్లు చూపించింది. అనంతరం అవతలి వ్యక్తి ఇంకా నీకు ఏమైనా క్రెడిట్ కార్డులున్నాయా? అని అడిగాడు. ఎస్‌బీఐ, యాక్సిస్‌బ్యాంక్, ఇండస్‌ల్యాండ్ కార్డులున్నాయని చెప్పడంతో అవతలి వ్యక్తి ఫోన్ పెట్టేశాడు. అన్ని కార్డుల గురించి ఎందుకు అడిగాడని అనుమానం రావడంతో వెంటనే ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు యాప్‌లో చెక్ చేయగా అందులో నుంచి రూ.1,61,353 డెబిట్ అయినట్లు గుర్తించాడు. దీంతో వెంటనే అవతలి వ్యక్తి ఫోన్ నంబర్‌కు ఫోన్ చేయడంతో సాయంత్రం వరకు మీకు డబ్బులు వస్తాయని చెప్పి ఫోన్ కట్ చేశాడు. యాక్సిస్ బ్యాంకు కార్డు నుంచి రూ.3,87,093, ఇండస్ బ్యాంకు క్రెడిట్ కార్డు నుంచి రూ.1,94,498, హెచ్‌డీఎఫ్‌సీ కార్డు నుంచి రూ.1.30లక్షలు కట్ అయ్యాయి. ఇలా నాలుగు క్రెడిట్ కార్డుల నుంచి మొత్తం రూ.8.72 లక్షలు కట్ అయ్యాయి. దీంతో మోసపోయానని గుర్తించి వెంటనే ఆన్‌లైన్‌తో పాటు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై గండ్రాతి సతీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రూ.8.72 లక్షలు కాజేసిన
సైబర్ నేరస్తులు
పోలీసులకు ఫిర్యాదు

సైబర్ వలలో ఆలయ ఉద్యోగి

సైబర్ వలలో ఆలయ ఉద్యోగి