
జ్వరపీడితులు..
జిల్లాలో డెంగీ కేసుల వివరాలు
176 డెంగీ కేసుల నమోదు...
విజృంభిస్తున్న సీజనల్ వ్యాధులు
● ఆస్పత్రులకు పరుగులు పెడుతున్న జనం
● జీజీహెచ్‌లో పెరుగుతున్న ఓపీ
● జిల్లాలో 176 డెంగీ కేసులు నమోదు
నెహ్రూసెంటర్: జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలు తున్నాయి. దగ్గు, జ్వరం, నొప్పులతో ప్రజలు ఆస్పత్రుల బాట పడుతున్నారు. చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతీ ఇంట్లో ఒకరు, ఇద్దరు చొప్పున జ్వరం బారినపడి వైద్యం కోసం ఆస్పత్రుల్లో క్యూ కడుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రితో పాటు ప్రైవేట్ ఆస్పత్రులు, చిన్న పిల్లల ఆస్పత్రులు కిక్కిరిసిపోతున్నాయి. ఇదిలా ఉండగా గతేడాది జిల్లాలో డెంగీ విలయతాండవం చేయగా.. ప్రస్తు తం ఇప్పటి వరకు 176 డెంగీ కేసులు నమోదు కాగా.. ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
పారిశుద్ధ్య లోపంతోనే..
పారిశుద్ధ్యలోపం కారణంగా డెంగీ కేసులు నమోదవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. మహబూబాబాద్ పట్టణం, ఇందిరానగర్, వడ్డెర కాలనీ, కేసముద్రం మండలం సర్వాపురం ప్రాంతాల నుంచి ఇప్పటి వరకు డెంగీ కేసులు అధికంగా నమోదవుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఇంటి పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, నీరు నిల్వ లేకుండా చూసుకోవడం, మురికినీరు కాల్వల్లో ప్రవహించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. దోమలు వ్యాప్తి కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా వ్యహరించాలని వైద్యులు తెలుపుతున్నారు.
అవగాహన, మెడికల్ క్యాంపులు..
సీజనల్ వ్యాధుల బారిన పడకుండా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఎప్పకప్పుడూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పట్టణంతో పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పి స్తూ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. ప్రజల వద్దకే వెళ్లి రక్త నమూనాలను సేకరించి పరీక్షలు ని ర్వహిస్తున్నారు. మూడు రోజుల్లో జ్వరం తగ్గకుంటే వెంటనే ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాలని వైద్య సిబ్బంది సూచిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాలకు నోడల్ అధికారులను నియమించి సీజనల్ ముప్పుకు గురికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండేలా వైద్య ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టింది.
ప్రైవేట్‌కు వెళ్తే అంతే సంగతులు..
ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తే రోగుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఆస్పత్రికి వెళ్లింది మొదలు టెస్టులు, అడ్మిట్, ట్రిట్‌మెంట్ అంటూ అత్యధిక ఫీజులను వసూలు చేస్తున్నారని ప్రజలు, రోగులు ఆరోపిస్తున్నారు. జ్వరం, దగ్గు అని వెళ్తే తప్పనిసరిగా టెస్టులు రాస్తున్నారు. పిల్లల ఆస్పత్రులు జ్వరపీడితులతో కిటకిటలాడుతున్నాయి. జలుబు, ద గ్గు, జ్వరంతో చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నా రు. ఇదే అదునుగా భావించిన కొంతమంది అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు తెలిసింది.
ఏడాది కేసుల సంఖ్య
2024 419
2025 (ఇప్పటి వరకు) 176
జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు 176 డెంగీ కేసులు నమోదుయ్యాయి. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తూ నమోదు కానీ కేసులు కూడా ఉన్నాయి. గతేడాది 419 డెంగీ కేసులు, అలాగే మలేరియా, చికెన్‌గున్యా వంటి కేసులు నమోదయ్యాయి.