
మెడికోల సతమతం!
హాస్టల్ లేక అవస్థలు
సాక్షి, మహబూబాబాద్: ప్రభుత్వ మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటికే మూడు బ్యాచ్‌లు రాగా మరో బ్యాచ్ రానుంది. కళాశాల భవన నిర్మాణం దేవుడెరుగు.. హాస్టల్ భవనం పూర్తి చేసినట్లు చెబుతున్న అధికారులు కళాశాలకు అప్పగించడం లేదు. దీంతో మెడికల్ విద్యార్థులు ఎక్కడ ఉండాలో తెలియక సతమతవుతున్నారు. నిర్మాణ పనులు పూర్తయిన హాస్టల్ భవనం అప్పగించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రిన్సిపాల్, జిల్లా ఉన్నతాధికారులను కోరుతున్నారు.
వారి పాపం.. వీరికి శాపం
జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల మంజూరు చేయడంతో పాటు స్థలం కేటాయించి రూ.250కోట్ల మేరకు కేటాయించారు. వీటితో పాటు మెడికల్, నర్సింగ్ కళాశాలల భవనాలు, ల్యాబ్స్, థియేటర్లు, 20 విభాగాల డాక్టర్ల చాంబర్లు, బెడ్స్, క్రిటికల్ కేర్ భవనాలు, డైనింగ్ హాల్, విద్యార్థిని, విద్యార్థులతో పాటు ప్రిన్సిపాల్, ప్రొఫెసర్ల కోసం క్వార్టర్స్ నిర్మించాలి. అయితే పనులు ప్రారంభించి నాలుగు సంవత్సరాలు గడిచినా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ నర్సింగ్ కళాశాల కోసం నిర్మించిన భవనంలోనే తరగతులు జరుగుతున్నాయి. దీంతో డాక్టర్లు, స్టాఫ్ నర్సులు సరిపడ ఉన్నా.. హాస్టల్స్, క్వార్టర్స్ లేక విద్యార్థులు, ప్రొఫెసర్లు ఇబ్బందులు పడుతున్నారు.
ఇదేం తాత్సారం..
సరైన వసతులు కల్పించకపోతే ప్రస్తుతం కౌన్సెలింగ్‌లో కళాశాలకు సీట్లు కేటాయించమని హెచ్చరిక చేసిన నేపథ్యంలో ఉరుకులు, పరుగుల మీద పనులు చేశారు. హాస్టల్స్, డైనింగ్ హాల్ నిర్మాణం పూర్తి చేశారు. ప్రస్తుతం ఉన్న 330 పడకలకు తోడుగా ఈ విద్యాసంవత్సరం ప్రారంభం వరకు 600కు పైగా పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేసేందుకు 50 పడకల క్రిటికల్ కేర్, 250 పడకల జనరల్ విభాగాల కోసం పనులు చేస్తున్నారు. ఇప్పటికే మూడు బ్యాచ్‌లకు చెందిన 450 మంది విద్యార్థులు చదువుతుండగా.. పది పదిహేను రోజుల్లో నాల్గో బ్యాచ్ 150 మంది విద్యార్థులు వస్తారు. కాగా పూర్తి చేసిన హాస్టల్ భవనాలను తాత్సారం చేయకుండా అప్పగిస్తే ఇబ్బందులు తొలుగుతాయని మెడికల్ కళాశాల విద్యార్థులు కోరుతున్నారు.
హాస్టల్ సౌకర్యం లేక అవస్థలు
పాత కలెక్టరేట్‌లో కొంతకాలం వసతి
జేఎన్‌టీయూ విద్యార్థుల కోసం
ఖాళీ చేయించిన అధికారులు
అర్ధంతరంగా సామగ్రితో
ఇంటికి పయనం
హాస్టల్ భవన నిర్మాణం
పూర్తయినా అప్పగించని ఆఫీసర్లు
సెప్టెంబర్ 2నుంచి పరీక్షలు..
ఎక్కడ ఉండాలో తెలియని పరిస్థితి
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్ కళా శాలలకు దీటుగా తరగతులు నిర్వహిస్తున్న మానుకోట మెడికల్ కళాశాలకు హాస్టల్ వసతి లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. భవన నిర్మాణాల్లో జాప్యం కావడంతో విద్యార్థినులకు పాత కలెక్టరేట్‌లో హాస్టల్ నిర్వహించారు. అయితే అక్కడే జేఎన్‌టీయూ అనుబంధ ఇంనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయడంతో మెడికల్ విద్యార్థినులు అర్ధంతరంగా ఖాళీ చేయాల్సి వచ్చింది. దీంతో ఎక్కడ ఉండాలో తెలియక ఇంటిబాట పట్టిన విద్యార్థినులు తరగతులకు సక్రమంగా హాజరు కాలేకపోయారు. అయితే సెప్టెంబర్ 2నుంచి సెమిస్టరీ పరీక్షలు ఉన్నా యి. హాస్టల్ వసతి లేకపోయినా ఇంటి వద్ద ఉండి చదువుకున్న విద్యార్థినులు ఇప్పుడు పరీక్షలు రాసేందుకు తప్పనిసరిగా రావాల్సి ఉంది. అ యితే హాస్టల్ లేదు. ఇలాంటి పరిస్థితిలో ఆడపిల్లలను ఎలా పంపించాలి.. ఎక్కడ ఉంచాలని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.