
పెండింగ్ కేసుల పరిష్కారంపై దృష్టి
● ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్
మహబూబాబాద్ రూరల్: పెండింగ్ కేసుల పరిష్కారంలో పోలీసు అధికారులు మరింత చొరవ చూపాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. నెలవారీ నేర సమీక్ష సమావేశం మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. బుధవారం నుంచి ప్రారంభమయ్యే గణేశ్ ఉత్సవాలను ప్రజలు ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. విగ్రహాల ప్రతిష్ఠాపన నుంచి నిమజ్జనం వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని, అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గంజాయి రవాణా, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా, పేకాట స్థావరాలను గుర్తించి, కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల నిర్మూలనలో భాగంగా స్థానిక పాఠశాలలు, కళాశాలల్లో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. గ్రామాల్లో చిన్నచిన్న గొడవలు జరిగినప్పుడు వెంటనే తగిన చర్యలు తీసుకోవడం ద్వారా, పెద్ద నేరాలను నియంత్రించవచ్చని సూచించారు. పోలీస్ స్టేషన్ల పరిధిలో బీట్ సిస్టమ్‌ను మరింత మెరుగుపర్చాలన్నారు. షీటీం ద్వారా ఈవ్ టీజింగ్ వంటివి జరగకుండా అరికట్టాలన్నారు. సమావేశంలో డీఎస్పీలు తిరుపతిరావు, కృష్ణకిశోర్, శ్రీనివాస్, డీసీఆర్బీ సీఐ సత్యనారాయణ, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

పెండింగ్ కేసుల పరిష్కారంపై దృష్టి