
బోధనోపకరణాలతో విద్యాభ్యాసం సులభతరం
● కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్
మహబూబాబాద్ అర్బన్: బోధనోపకరణాలతో విద్యార్థులకు విద్యాభ్యాసం సులభతరంగా ఉంటుందని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అన్నారు. మున్సిపల్ పరిధిలోని అనంతారం మోడల్ స్కూల్‌లో మంగళవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి టీఎల్‌ఎం మేళాను నిర్వహించారు. కలెక్టర్ టీఎల్‌ఎంలను పరిశీలించి, వాటి ప్రత్యేకతలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి విద్యార్థులకు బోధన, ఉపాధ్యాయుల పనితీరును, మధ్యాహ్నం భోజనం, వసతుల గురించి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు విద్యార్థులకు రోల్ మోడల్‌గా ఉండాలన్నారు. టీచింగ్, లెర్నింగ్ మెటీరియల్‌తో విద్యార్థులకు ఎంతగానో ఉపయోగం ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు అభ్యసన సామగ్రిని ఉపయోగించడం ద్వారా విద్యార్థులకు అర్థవంతమైన బోధన అందుతుందన్నారు. ఉపాధ్యాయులు అంకితభావంతో విద్యాబోధన చేసి విద్యార్థులను ఆదర్శంగా తీర్చిదిద్దాలన్నారు. డీఈఓ రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో 18 మండలాల నుంచి తెలుగు, ఇంగ్లిష్, గణితం, ఈవీఎస్‌లో 180 ఎగ్జిబిట్లను ఉపాధ్యాయులు ప్రదర్శించారన్నారు. జిల్లాస్థాయిలో ప్రదర్శించిన ఎగ్జిబిట్లలో 8 ఉత్తమ టీఎల్‌ఎంలను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశామన్నారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి బి. అప్పారావు, ఏఎంఓ ఆజాద్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.