
రైతుల అరిగోస..
● టోకెన్‌ల కోసం రాత్రి నుంచే పడిగాపులు
● క్యూలైన్‌లో చెప్పులు, చెట్ల కొమ్మలు
కేసముద్రం: యూరియా టోకెన్ల కోసం సోమవారం రాత్రి నుంచే రైతులు పడిగాపులు పడ్డారు. క్యూలో చెప్పులు, చెట్ల కొమ్మలను ఉంచారు. అలాగే సరిపడా యూరియా అందించాలంటూ రైతులు ప్రధాన రహదారిపై రాస్తారోకోకు దిగిన సంఘటన కేసముద్రం మున్సిపాలిటీ, ఇనుగుర్తి మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. కేసముద్రంవిలేజ్ పీఏసీఎస్‌కు యూరియా వస్తుందనే సమాచారం మేరకు సోమవారం రాత్రి సొసైటీ వద్ద రైతులు పడిగాపులు పడ్డారు. దీంతో పోలీసులు చేరుకుని రాత్రి సమయంలో ఇక్కడ నిద్రిస్తే విష పరుగులు వస్తాయని నచ్చజెప్పి రైతులు పంపించారు. దీంతో తెల్ల వారుజామున 4 గంటలకు రైతులు సొసైటీ వద్దకు చేరుకుని క్యూలో నిల్చున్నారు. 222 బస్తాలకు టోకెన్లు ఇచ్చే క్రమంలో.. రైతులంతా ఒక్కసారిగా సెంటర్‌లోకి వెళ్లడంతో గందరగోళపరిస్థితి ఏర్పడింది. దీంతో సంఘటన స్థలానికి రూరల్ సీఐ సర్వయ్య, ఎస్సై మురళీధర్‌రాజు, తహసీల్దార్ వివేక్ చేరుకుని రైతులకు నచ్చజెప్పి పరిస్థితిని చక్కదిద్దారు. చివరకు 222 మందికి టోకెన్లు అందజేసి.. ఒక్కో బస్తా చొప్పున పంపిణీ చేశారు. అదే విధంగా ఇనుగుర్తి మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద 222 బస్తాలకు గాను టోకెన్లు ఇవ్వగా, రైతులు క్యూలో తమ చెప్పులను, చెట్ల కొమ్మలను ఉంచి పడిగాపులు పడ్డారు. ఈ క్రమంలో అత్యధిక సంఖ్యలో వచ్చిన రైతుల తమకు సరిపడా యూరియా అందించాలంటూ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. సంఘటన స్థలానికి పోలీసులు, అధికారులు చేరుకుని రైతులకు నచ్చజెప్పారు. అనంతరం వర్షం పడడంతో రైతు వేదిక లోపల రైతులను క్యూలో ఉంచి టోకెన్లు అందించారు. కాగా మహబూబాబాద్ ఏడీఏ శ్రీనివాసరావు సెంటర్ వద్దకు చేరుకుని, రైతులకు సూచనలు చేశారు. నానో యూరియాను పిచికారీ చేయాలని ఆయన సూచించారు.

రైతుల అరిగోస..