
నత్తేనయం!
కొత్తగూడ: ఏజెన్సీ గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీలు నెరవేరడం లేదు. ముఖ్యంగా రోడ్ల నిర్మాణాల్లో తీవ్రం జాప్యం జరుగుతోంది. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఏళ్లుగా పనులు సాగుతూనే ఉన్నాయి. అలాగే మరికొన్ని పనులు అటవీశాఖ అనుమతుల పేరిట కొర్రీలు పెట్టడంతో రోడ్ల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. కంకరపోసి వదిలేశారు. కాగా, పనులు త్వరితగతిన పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రతీ సమావేశంలో చెబుతున్నప్పటికీ.. పనుల్లో మాత్రం కదలిక రావడం లేదు.
బ్రిడ్జి నిర్మించి రోడ్డు వేయడం ఆపేశారు..
కొత్తగూడ మండల కేంద్రం నుంచి సాదిరెడ్డిపల్లి, జంగవానిగూడెం, ముస్మి వైపునకు వెళ్లే ప్రధాన రహదారిపై కోటి రూపాయలతో బ్రిడ్జి నిర్మించారు. బ్రిడ్జి నుంచి రెండు వైపులా వంద మీటర్లు బీటీ రోడ్డు నిర్మించాలి. కానీ ఏడాదిగా పనులు చేపట్టడం లేదు. దీంతో మట్టి రోడ్డుపై గుంతలు పడి పూర్తిగా బురదమయంగా మారింది. ఇటు వైపునకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బిల్లులు రాకనే పనులు చేపట్టడం లేదని కాంట్రాక్టర్లు వాపోతున్నట్లు తెలిసింది. అదేవిధంగా కొత్తపల్లి నుంచి ఓటాయి క్రాస్‌రోడ్డు వరకు డబుల్ రోడ్డు నిర్మాణం పూర్తి కాలేదు. దీంతో వర్షం వచ్చిందంటే భారీ వాహనాలు రాకపోకలు సాగించడం లేదు.
అటవీశాఖ అనుమతులు రాక..
అటవీశాఖ నుంచి అనుమతులు రాకపోవడంతో పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి బక్కచింతలపల్లి, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి ఈశ్వరగూడెం, చెరువుముందుతండా నుంచి దొరవారివేంపల్లి, గోవిందాపురం నుంచి పొగుళ్లపల్లి, నీలంపల్లి నుంచి పొగుళ్లపల్లి, ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి కుందెనపల్లి గ్రామాల రోడ్ల పనులు నాలుగేళ్లుగా కంకరకే పరిమితమయ్యాయి. కొత్తపల్లి నుంచి దుబ్బగూడెం రోడ్డు సగం మాత్రమే పూర్తయింది. ఈరోడ్డు అనుమతుల కోసం పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. పాత రోడ్ల విస్తరణను అటవీశాఖ అడ్డుకోవడంతో స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొత్తగూడ ఏజెన్సీలో
ఏళ్లుగా పూర్తికాని రోడ్లు
కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో కొన్ని,
అటవీశాఖ అడ్డంకితో
మరికొన్ని నిలిచిపోయిన పనులు
ప్రజలకు తప్పని ఇబ్బందులు

నత్తేనయం!