
వేయిస్తంభాల ఆలయంలో గణపతి ఉత్సవాలు
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల దేవాలయంలో బుధవారం వినాయక చవితిని పురస్కరించుకుని గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఆలయ ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్రశర్మ, వేదపండితులు మణికంఠశర్మ, సందీప్‌శర్మ, ప్రణవ్‌ల ఆధ్వర్యంలో ఉదయం 5 గంటల నుంచి ఉత్తిష్ట గణపతికి కోనేరునీటితో నవరసాభిషేకం నిర్వహించి, హరిద్రాకుంకుమలేపనం గావించి వరసిద్ధివినాయకుడిగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. విగ్రహదాత శ్రీకుమార్ రెమాండ్స్ షోరూం అధినేత వెనిశెట్టి సుబ్రహ్మణ్యం ఇంటి నుంచి మంగళవాయిధ్యాలతో వేదమంత్రోచ్ఛరనలతో ఊరేగింపుగా విగ్రహాన్ని తీసుకువచ్చి విష్ణుమూర్తి ఆలయం ఎదుట ఏర్పాటు చేసిన వేదికపై ప్రతిష్ఠించారు. కళశస్థాపన, మంటపారాధన, నవగ్రహారాధన, అఖండదీపారాధన, శోడషోపచారపూజ, పత్రిపూజ, ఉండ్రాళ్ల నైవేద్యం నివేదన, ఋత్విగ్వరణం, మహాహారతి, తీర్దప్రసాదాల వితరణ జరిపారు. అనంతరం అగ్ని ప్రతిష్టాపన, గణపతి నవగ్రహరుద్రహోమం నిర్వహించారు.
ఆలయ అభివృద్ధికి రూ.75కోట్లు..
మహాగణపతి ఉత్సవాలను ఎంపీ కడియం కావ్య, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి పాల్గొని జ్యోతి ప్రజ్వలనం చేసి పూజా కార్యక్రమాలను ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కావ్య మాట్లాడుతూ వేయిస్తంభాల ఆలయ అభివృద్ధికి రూ .75కోట్లు కేటాయించాలని కేంద్ర పురావస్తు, టూరిజం శాఖ మంత్రి గజేంద్రసింగ్ షికావత్‌ను కలిసి విన్నవించినట్లు తెలిపారు. దీనికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి కృషిచేస్తానన్నారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు గట్టు మహేష్‌బాబు, దాత నడిపల్లి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. సాయంత్రం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ప్రవచకులు వంగల సోమయాజులు శమంతఖోపాఖ్యానం వినిపించారు.
శ్రీలక్ష్మిగణపతిగా అలంకరణ
గణపతి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు వరసిద్ధి వినాయకుడిగా, రెండో రోజు శ్రీలక్ష్మి గణపతిగా అలంకరించి భక్తులకు దర్శనానికి అనుమతించారు. వేముల సత్యమూర్తి ఆధ్వర్యంలో నిత్యాన్నదానం ప్రారంభించారు. ఆలయ ఈఓ ధరణికోట అనిల్‌కుమార్ పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఉత్సవకమిటీ సభ్యులు పులి రజినీకాంత్, గండ్రాతి రాజు, చొల్లేటి కృష్ణమచారి పాల్గొన్నారు. సాయంత్రం శివానంద నృత్యమాల శిష్య బృందంచే కూచిపూడి నృత్యాలు అలరించాయి.
ప్రారంభించిన ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి

వేయిస్తంభాల ఆలయంలో గణపతి ఉత్సవాలు